అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి
బూర్గంపాడు: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. బూర్గంపాడులో సోమవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో వారు మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉంటే నష్టాలను నివారించవచ్చన్నారు. విపత్తుల సమయంలో యువత, విద్యార్థులు, అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని, తరచూ వరద ముంపునకు గురయ్యే బూర్గంపాడు మండల ప్రజలకు ఇలాంటి మాక్ డ్రిల్‌లు ఎంతో అవసరమని అన్నారు. విపత్తుల సమయంలో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఆ తర్వాత అంబేడ్కర్ కాలనీలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో లైఫ్ జాకెట్లు, బోట్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు, వైద్యసేవలు, తాగునీటి సరఫరా, భోజన వసతి వంటి సేవలను డెమో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి శ్రీనయ్య పాల్గొన్నారు.
చిన్ననాటి నుంచే మొక్కలు పెంచాలి
చండ్రుగొండ : ప్రతీ ఒక్కరు చిన్న నాటి నుంచే మొక్కలు పెంచడంతోపాటు వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో ఉన్న కనకగిరి గుట్టల ప్రాంతాన్ని సోమవారం ఆయన వివిధ కళాశాలల స్కౌట్ విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల పెంపకంతో పాటు వాటి అవశ్యకత తెలుసుకోకుంటే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.
విపత్తుల నివారణ మాక్‌డ్రిల్‌లో
కలెక్టర్, ఎస్పీ


