వరాహ రూపంలో వరాల రామయ్య
● వాగ్గేయకార వంశీయుల ఆధ్వర్యంలో శోభాయాత్ర ● అధ్యయనోత్సవాలకు పోటెత్తిన భక్తజనం ● నేడు నరసింహావతారంలో స్వామివారు
భద్రాచలం: లోకకంఠకుడైన హిరణ్యాక్షుడుని సంహరించి భూమిని తన కోరలతో పైకెత్తి లోకసంరక్షణ చేపట్టిన వరాహావతారంలో దర్శనమిచ్చిన రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. ‘వరాలు ఇచ్చే రామయ్య’ నామస్మరణలతో భద్రగిరి పులకించింది. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతుండగా.. పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంలో అలంకరించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ నిర్వహించి ఆరాధన, నివేదన సమర్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి పూజలు చేశారు. ఆ తర్వాత వేద పండితులు దివ్య ప్రబంధాలు పఠించారు. అనంతరం గర్భగుడి నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి ఆళ్వార్లతో సహా కొలువుదీర్చారు.
వైభవంగా శోభాయాత్ర..
భద్రాచలం రామాలయానికి ఆధ్యులు, భక్త రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్న, ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వాగ్గేయకారులు తూము నర్సింహదాసు వంశీయుల ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారిని పల్లకీ సేవగా మిథిలా స్టేడియం వేదికపైకి తీసుకొచ్చారు. భక్తుల సందర్శనాననంతరం తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ సాగింది.
నేడు నరసింహావతారం..
తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశివుడు అనే రాక్షసుడిని సంహరించడానికి నారాయణుడు నరసింహావతారాన్ని ధరించాడు. ఈ అవతార నిడివి స్వల్పకాలమైనా.. భగవానుడి సర్వవ్యాపకతను తెలియజేస్తుంది. భూత గ్రహ బాధలు, కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే విముక్తి పొందుతారని శాస్త్రం చెబుతోంది.


