కొలువుదీరిన పాలకవర్గాలు
భద్రాచలంలో ప్రమాణం చేయించిన పీఓ..
● కోలాహలంగా ప్రమాణ స్వీకార వేడుకలు ● సర్పంచ్‌లుగా 468 మంది బాధ్యతల స్వీకరణ ● 4,148 మంది వార్డు సభ్యులు కూడా..
చుంచుపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులతో ఆయా గ్రామాల కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు సైతం పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో 471 పంచాయతీలు, 4,168 వార్డులకు గాను మూడు సర్పంచ్ స్థానాలు, 20 వార్డులకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 468 మంది సర్పంచ్‌లు, 4,148 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
అసౌకర్యాల నడుమ..
చిన్న పంచాయతీల్లో ప్రమాణ స్వీకార వేడుకలు ఇరుకు గదుల్లోనే కొనసాగాయి. అనేక చోట్ల ఆరు బయట చెట్ల కింద, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర భవనాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలక మండలి సభ్యులను ఘనంగా సన్మానించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 425 మంది సర్పంచ్‌లు కొత్తగా ఎన్నికై న వారే కావడం గమనార్హం. రిజర్వేషన్లు తారుమారు కావడంతో ఎక్కువ మంది కొత్తవారే బరిలో నిలిచి గెలుపొందారు. గతంలో పురుషులు ఉన్న చోట రిజర్వేషన్ ఈసారి మహిళలకు కలిసి రావడంతో చాలా మంది వారి భార్యలతో పోటీ చేయించి గెలిపించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది మహిళలు సర్పంచ్‌లుగా కొలువుదీరడం విశేషం. ఇక ఈసారి సర్పంచ్‌లుగా గెలిచిన వారిలో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపే వారే ఉన్నారు. వీరిలో పలువురు డిగ్రీ, ఆపై విద్యార్హతలు గల వారు ఉన్నారు. జిల్లాలో 468 మంది సర్పంచ్‌లకు గాను 266 మంది మహిళలు, వీరిలో 35 ఏళ్లలోపు వారు 197 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు.
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సం వైభవంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య హాజరు కాగా, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సర్పంచ్ పూనెం కృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు ప్రమాణం చేయించారు. నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే తదితరులు ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించి, భద్రాచలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా, భద్రాచలంలో ఎనిమిదేళ్ల తర్వాత పంచాయతీ పాలకవర్గం కొలువుదీరడం గమనార్హం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు 2013లో ఎన్నికలు జరగగా, 2018లో ఆ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత మున్సిపాలిటీగా మారుతుందని కొన్ని రోజులు, మూడు పంచాయతీలుగా విభజన జరుగుతుందని కొంత కాలం ఎన్నికలు నిర్వహించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలాన్ని తిరిగి ఒకే గ్రామ పంచాయతీగా చట్ట సవరణ చేయడం, ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.


