సింగరేణి పవర్‌ | - | Sakshi
Sakshi News home page

సింగరేణి పవర్‌

Dec 23 2025 7:24 AM | Updated on Dec 23 2025 7:24 AM

సింగరేణి పవర్‌

సింగరేణి పవర్‌

కీలక రంగంలో

140 ఏళ్లు బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సంస్థ

2011లో థర్మల్‌ పవర్‌ సెక్టార్‌లోకి ఎంట్రీ

గ్రీన్‌ ఎనర్జీలోనూ వడివడిగా అడుగులు

ఇప్పుడు రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌పైనా ఫోకస్‌

నేడు ఆరు జిల్లాల పరిధిలో ‘సింగరేణి డే’

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బ్రిటిష్‌ అధికారులు ఇల్లెందు సమీపంలో 1871లో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. తొలి గని 1889లో ప్రారంభమైంది. క్రమంగా కార్మిక హక్కులను గరిష్ట స్థాయిలో అమలు చేసే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 1990వ దశకంలో అయితే ఏకంగా లక్షా ఇరవై వేల మందికి ఉపాధి కల్పించే సంస్థగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నిర్వహణ లోపాలతో నష్టాల బాట పట్టింది. అయితే, మళ్లీ పుంజుకుని కార్మికులకు లాభాలు అందించే స్థాయికి సంస్థ ఎదిగింది. వందేళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సంస్థ క్రమంగా ఇతర రంగాలపైనా దృష్టి సారించింది.

పవర్‌ సెక్టార్‌లో

దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బొగ్గులో సింగరేణి వాటా పది శాతమే. కానీ కోలిండియా చేయలేని సాహసాన్ని సింగరేణి తలకెత్తుకుంది. అందులో భాగంగా 2011లో మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద 1,200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం మొదలెట్టింది. ఈ ప్లాంట్‌ నుంచి 2016లో విద్యుత్‌ ఉత్పత్తి మొదలైన తర్వాత అనేక రికార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించనున్నారు. దీంతో పాటు ఒడిశాలోని నైనీ వద్ద 2,400 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం ప్రతిపాదన దశలో ఉంది. రాజస్థాన్‌లో 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణానికీ సన్నాహాలు జరుగుతున్నాయి.

గ్రీన్‌ ఎనర్జీలో

గడిచిన పదేళ్లుగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను సింగరేణి స్థాపిస్తోంది. ప్రస్తుతం సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యం 240 మెగావాట్లుగా ఉంది. అతి త్వరలోనే ఇది 540 మెగావాట్లకు చేరుకోనుంది. దీంతో జీరో నెట్‌ సంస్థగా సింగరేణి గుర్తింపు పొందనుంది. సోలార్‌ రంగంలో వచ్చిన విజయాలతో పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ పవర్‌ సెక్టార్‌లోకి అడుగు పెడుతోంది. ఈ ఉత్సాహంతోనే రాజస్థాన్‌(1,500 మెగావాట్లు), ఒడిశా(2,500 మెగావాట్లు)ల్లో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి దిశగా సింగరేణి అడుగులు వేస్తోంది.

కార్మిక, సామాజిక బాధ్యత

కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్‌ సొసైటీని సింగరేణి నిర్వహిస్తోంది. దీని ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. ఇటీవల సెంట్రల్‌ సిలబస్‌ కూడా ప్రవేశపెట్టారు. గోదావరిఖని, కొత్తగూడెంలో ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రామగుండం మెడికల్‌ కాలేజీకి ఆర్థిక సాయం అందించింది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు రాజీవ్‌ అభయహస్తం ద్వారా తన వంతు చేయూతను అందిస్తోంది.

ఖ్వాజా హయాం నుంచి..

స్వాతంత్య్రానికి పూర్వమే నైజాం జమానాలో బ్రిటీషర్లు ఇల్లెందులో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. హైదరాబాద్‌ (దక్కన్‌) కంపెనీ లిమిటెడ్‌ పేరుతో 1889లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1920 డిసెంబర్‌ 23న కంపెనీ పేరును సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌గా మార్చారు. కాగా 2002లో అప్పటి సింగరేణి సీఎండీ ఖ్వాజా డిసెంబర్‌ 23న సింగరేణి డేగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం డిసెంబర్‌ 23న సింగరేణి డే నిర్వహిస్తున్నారు. అయితే, ఈసారి వేడుకలకు బడ్జెట్‌ తగ్గించడం, ప్రకాశం స్టేడియంలో ఉత్సవాలు నిర్వహించకపోవడం పట్ల కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి రంగంలోకి వెళ్లిన తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణి ఇప్పుడు రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ఎక్స్‌ప్లోరేషన్‌లోనూ తన ముద్ర వేసే పనిలో ఉంది. సింగరేణి బొగ్గు గనుల్లో వచ్చే ఓవర్‌ బర్డెన్‌ (ఓబీ), థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి వచ్చే బాటమ్‌ యాష్‌లలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ ఉన్నట్టుగా గుర్తించారు. వీటిపై చేపట్టిన ప్రయోగాలు చివరి దశకు వచ్చాయి. దీంతో పాటు అసోంలో గ్రాఫైట్‌, కర్ణాటకలో రాగి, బంగారం ఎక్స్‌ప్లోరేషన్‌లోనూ సింగరేణి అడుగు పెట్టింది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో విస్తరించే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement