కొత్తగూడెంటౌన్: పట్టణంలోని ఉర్దూ ఘర్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్డర్ గంగిరెడ్డి యుగేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు ఆయనతోపాటు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా సెక్రటరీ మొగిలి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో లగడపాటి రమేశ్, తైక్వాండో అధ్యక్షులు నిట్ట ప్రసాద్, నాగా సీతారాములు, నగేశ్, కనుకుంట్ల కుమార్, సారంగపాణి, శ్రీను, నరసింహారావు, భువనేశ్, రమాదేవి, జగన్, పద్మ, కింటూ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
ఖమ్మంమయూరిసెంటర్: విద్యారంగానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ సమితి సభ్యులు ఇటికాల రామకృష్ణ కోరారు. ఆదివారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి ఎన్నో చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం నిధులు కేటాయించడం లేదని, దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని వాపోయారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఖమ్మంలో యూనివర్సిటీ ఎర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, దీనిని అమలు చేయాలన్నారు. సమీకృత గురుకులాల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేయడమేనని రామకృష్ణ ఆరోపించారు. సమావేశంలో లక్ష్మణ్, మధు, శివనాయక్, మనోజ్, గోపి, ప్రతాప్, నరేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
లోక్యాతండాలో
ముగిసిన హోలీ
కూసుమంచి: మండలంలోని లోక్యాతండాలో మూడు రోజుల హోలీ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. తండాలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించారు. తండావాసులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, డప్పులు వాయిస్తూ ఆట పాటలతో ఆనందంగా గడిపారు. మహిళలు సైతం నృత్యం చేస్తూ సందడి చేశారు.
దేవాలయాల
నిర్మాణాలకు విరాళం
కామేపల్లి: మండలంలోని మర్రిగూడెం, తాళ్లగూడెం, కెప్టెన్‌బంజర గ్రామాల్లోని దేవాలయాల నిర్మాణాలకు మర్రిగూడెం గ్రామానికి చెందిన డీఎన్‌సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దిరిశాల నరేశ్‌చౌదరి ఆదివారం కమిటీ సభ్యులకు విరాళాలు అందజేశారు. కెప్టెన్‌బంజరలోని శ్రీ రామాలయంలో ధ్వజస్తంభానికి, మర్రిగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి తొలుత రూ.3 లక్షలు కమిటీ సభ్యులకు అందజేశారు. తాళ్లగూడెంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పి కమిటీ సభ్యులకు రూ.2 లక్షల నగదును అందజేశారు. దీంతో గ్రామస్తులు దాత నరేశ్‌చౌదరిని సత్కరించారు. కార్యక్రమంలో దిరిశాల ధనమ్మ, తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య, నల్లమోతు వెంకటనర్సయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పేకాటస్థావరంపై దాడి
ఎర్రుపాలెం: మండలంలోని కాచవరం సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా మొర్సుమల్లి గ్రామానికి చెందిన ఆరుగురు కాచవరం సమీపంలో పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.3 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్‌లు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు షురూ..
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు షురూ..