భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, చీరలు, గాజులు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ పిల్లలకు అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ రజినీకుమారి, అర్చకులు, వేద పండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
రామయ్యకు ముత్యాలు బహూకరణ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తెలంగాణ దేవాదాయ ట్రిబ్యునల్ చైర్మన్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి మండా వెంకటేశ్వర్లు ఆదివారం ముత్యాలు బహూకరించారు. ముందుగా ఆయనకు ఆర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.1.30 లక్షల విలువైన 500 గ్రాముల ముత్యాలను ఆలయ ఈఓ రమాదేవికి అందజేశారు. ఆలయ అధికారులు న్యాయమూర్తికి స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వో సాయిబాబు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సోమ, మంగళ వారాల్లో జిల్లాలో పర్యటిస్తున్నందున కలెక్టరేట్‌లో నేడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు ఈ పర్యటన కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం