సిబ్బంది కృషితోనే ఐటీడీఏకు గుర్తింపు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ యూనిట్ అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ ఐక్యతతో పనిచేయడం వల్లే రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు, మంచి పేరు వచ్చాయని పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థ సాధించిన విజయాలను వివరించారు. ఆశ్రమ పాఠశాలల్లో ‘పది’ ఫలితాలు మెరుగ్గా రావడం, క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడం అభినందనీయమన్నారు. గిరిజన మ్యూజియం ఏర్పాటుతో వారి సంస్కృతి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, కోయ భాషాభివృద్ధికి, గోత్రాలపై బుక్‌లెట్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరుద్యోగులకు డ్రైవింగ్ శిక్షణతో పాటు త్వరలో గ్రూప్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహిళా స్వయం ఉపాధికి ఎంఎస్‌ఎంఈ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామన్నారు. గిరి బజార్ ద్వారా గిరి మాల్ట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. గిరిజనులకు మరిన్ని సేవలు అందించేందుకు వచ్చే ఏడాదికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సిబ్బంది సమయపాలన పాటిస్తూ మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, ఆర్సీఓ అరుణకుమారి, ఏఓ సున్నం రాంబాబు, అధికారులు లక్ష్మీనారాయణ, సమ్మయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.
మహిళా గ్రూపునకు రూ.లక్ష చెక్కు..
ఆదివాసీ గిరిజన మహిళలు ఐకమత్యంతో కుటీర పరిశ్రమలు నెలకొల్పి ఆర్థికాభివృద్ధి సాధించాలని పీఓ రాహుల్ అన్నారు. చర్ల మండలం సున్నం గుంపు గ్రామానికి చెందిన ‘శ్రీ ముత్యాలమ్మ జాయింట్ గిరిజన మహిళా సొసైటీ’ సభ్యులకు ఆహార పదార్థాల తయారీ, సామగ్రి కొనుగోలుకు రూ.లక్ష చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పపువ్వు లడ్డూలు, నల్లేరు పచ్చడి వంటి పోషక పదార్థాల తయారీతో పది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. ఈ నిధులతో సోలార్ కుక్కర్లు, డ్రమ్ములు, గ్యాస్‌స్టవ్ వంటి పరికరాలు కొనుగోలు చేసి పరిశ్రమను లాభాల బాటలో నడపాలని సూచించారు. కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, గ్రూప్ సభ్యులు సమ్మక్క, రమాదేవి, ఈశ్వరి, శిరీష పాల్గొన్నారు.


