అభివృద్ధి దిశగా అడుగులు..
జిల్లా కేంద్రంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ
‘గూడెం’ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్
కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు ఏర్పాట్లు
ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాగుతున్న సర్వే
నిధుల కొరతతో పనుల్లో తీవ్ర జాప్యం
కొత్తగూడెంఅర్బన్: విద్యా, పారిశ్రామిక రంగాల్లో జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తున్నా.. నిధుల కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోంది. పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈ ఏడాది చెప్పుకోదగిన అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు లేకున్నా కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మాత్రం అడుగులు ముందుకు పడుతున్నాయి.
60 డివిజన్లతో కార్పొరేషన్..
మున్సిపాలిటీలుగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి 60 డివిజన్లతో జూన్ 2న కొత్తగూడెం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. రెండు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించగా, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఇక జిల్లాకు ఈ ఏడాది రూ.7,700.87 కోట్ల రుణ ప్రణాళిక ఖరారు చేయగా.. రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలకు కేటాయించారు.
రైల్వేలైన్ పనుల్లో జాప్యం
జిల్లాలోని పాండురంగాపురం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు మంజూరు కావడం శుభ పరిణామమే అయినా.. కేంద్రం చొరవ చూపి నిధులు విడుదల చేస్తేనే పనులు ప్రారంభమవుతాయి. ఇక పాండురంగాపురం నుంచి సారపాక రైల్వే లైన్ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ లైన్ పూర్తయితే భద్రాచలం వెళ్లే భక్తులకు సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. వీటికి నిధులు విడుదల చేయాలని, ఈ మేరకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
● లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడువాగుపై రిటర్నింగ్ వాల్ నిర్మించాలి. ప్రతీ ఏడాది వర్షాకాలం నీటి వదర వస్తే ఈ వాగు సమీపంలోని ఇళ్లన్నీ ముంపునకు గురవుతున్నాయి.
● కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పాటైనా ఇప్పటివరకు చెప్పుకోదగిన అభివృద్ధి పనులేవీ జరగలేదు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులు, సుందరీకరణ పనులు, అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరముంది.
అభివృద్ధి దిశగా అడుగులు..


