మానుకోటలో మూడు నామినేషన్లు | Sakshi
Sakshi News home page

మానుకోటలో మూడు నామినేషన్లు

Published Tue, Apr 23 2024 8:40 AM

వినోద్‌రావుకు బీ ఫామ్‌ అందజేస్తున్న 
శ్రీకాంత్‌, సత్యనారాయణ  - Sakshi

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి సోమవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థి రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారని అధికారులు తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలోని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు అభ్యర్థులు నామినేషన్‌పత్రాలు అందజేశారు. బీజేపీ నుంచి అజ్మీరా సీతారాంనాయక్‌ నామినేషన్‌ దాఖలు చేయగా, యూసీసీఆర్‌ఐ (ఎంఎల్‌) పార్టీ అభ్యర్థి పగిడి ఎర్రయ్య, స్వతంత్ర అభ్యర్థిగా మైపతి అరుణ్‌కుమార్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ రెండో సెట్‌ నామినేషన్‌ సమర్పించారు.

‘తాండ్ర’కు బీ ఫామ్‌

ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు సోమవారం పార్టీ బీ ఫామ్‌ అందుకున్నారు. ఆయన ఖమ్మంలో బీజేపీ పార్లమెంట్‌ ప్రభారి శ్రీకాంత్‌, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ బీ ఫామ్‌ అందజేశారు. ఈసందర్భంగా వినోద్‌రావు మాట్లాడుతూ ఈసారి ఖమ్మంలో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పెద్దమ్మతల్లి ఆలయంలో నేడు చండీహోమం

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం చండీ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ జి.సుదర్శన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు. సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలని సూచించారు. కాగా, తలనీలాలు, చీరలు పోగు చేసుకోవడం, పూలదండల విక్రయం, ఫొటోలు తీసేందుకు ఈనెల 26న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టికెట్లు, వాల్‌పోస్టర్ల ముద్రణ, ఇతర సామగ్రి, పూలదండల సరఫరాకు కూడా వేలం ఉంటుందని, ఆసక్తి గల వారు 26వ తేదీ ఉదయం 11 గంటల్లోగా రూ.200 చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని వెల్లడించారు.

25 నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ పరీక్షలు ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌లోని సెయింట్‌ మేరీస్‌, సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాల, బాబూ క్యాంప్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రాల్లో నిర్వహించనుండగా 846 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పాత కొత్తగూడెంలోని జెడ్పీ హైస్కూల్‌ (ఆనందఖని పాఠశాల), చుంచుపల్లి, బూడిదగడ్డ ప్రభుత్వ ఉన్న త పాఠశాలలతో పాటు బాబూక్యాంప్‌లోని లిటిట్‌ బర్డ్స్‌ పాఠశాల కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్‌ పరీక్షలకు 978 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఉదయం పరీక్షకు 9.05 గంటల వరకు, మధ్యాహ్నం 2.35 గంటల వర కు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రతి సెంటర్‌ వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంటాయని, మాల్‌ప్రాక్టీస్‌ జరుగకుండా సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఏసీజీఈ ఎస్‌.మాధవరావు(8919279238)ను సంప్రదించాలని సూచించారు.

నామినేషన్‌ సమరిస్తున్న బీజేపీ అభ్యర్థి
సీతారాంనాయక్‌
1/2

నామినేషన్‌ సమరిస్తున్న బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్‌

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement