కాలుజారి పడి చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

కాలుజారి పడి చిన్నారి మృతి

Published Tue, Apr 23 2024 8:35 AM

హానిక (ఫైల్‌)  - Sakshi

ఇల్లెందు: రోజంతా హాయిగా ఆడుకుని.. అమ్మమ్మ పక్కన పడుకుని నిద్రించిన చిన్నారి తెల్లవారకుండానే తనువు చాలించిన విషాద ఘటన ఇల్లెందులో చోటుచేసుకుంది. పట్టణంలోని డీఎస్పీ ఆఫీఎస్‌ వెనుక లైన్‌ సింగరేణి క్వార్టర్లో నివాసం ఉంటున్న సింగరేణి సెక్యూరిటీ విభాగం జమేదార్‌ కామరాజు – ఝాన్సీ దంపతుల మనుమరాలు పెనుగొండ హానిక(5) ఆదివారం రాత్రి అమ్మమ్మ పక్కనే పడుకుంది. అర్ధరాత్రి సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన హానిక కాలు జారి వెల్లకిలా పడడంతో తలకు తీవ్ర గాయమైంది. కిందపడిన శబ్దం వినిపించగానే ఝాన్సీ లేచి చూసేసరికే చిన్నారి సృహ కోల్పోయింది. ఇంట్లో నిద్రిస్తున్న కామరాజును లేపగా ఆయన భయంతో పరుగులు తీసి చుట్టుపక్కల వారిని పిలిచి చూపించారు. అప్పటికీ చిన్నారి లేవకపోవడంతో వెంటనే సింగరేణి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. హానిక తల్లి శ్రీలాస్య హైదరాబాద్‌లో ‘లా’కోర్సు మూడో సంవత్సరం చదువుతోంది. దీంతో చిన్నారిని అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంచారు. చిన్నారి మృతితో కార్మిక వాడలో విషాదం అలుముకుంది.

15 రోజుల్లో చెవులు కుట్టించాలని..

ఐదేళ్లు నిండిన తర్వాత ఆ చిన్నారికి చెవులు కుట్టించి ఘనంగా ఫంక్షన్‌ చేయాలని, బంధువులు, స్నేహితులను ఆహ్వానించాలని ఝాన్సీ, కామరాజు కలలు కన్నారు. తమ కలలు కల్లలుగానే మారిపోయాయని, చెవులు కుట్టిద్దామనుకుంటే అందనంత దూరం వెళ్లిపోయిందని వారు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. శ్రీలాస్య – కిరణ్‌ దంపతుల ఏకై న కూతురు హానిక మృతి వారికి తీవ్ర శోకం మిగిల్చింది.

సింగరేణి కార్మికవాడలో విషాదం

Advertisement
 
Advertisement
 
Advertisement