
మాట్లాడుతున్న ప్రియాంక ఆల
● 30న సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ● జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల
సూపర్‌బజార్(కొత్తగూడెం): రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని, ఎన్నికల బృందాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రచారాలు నిలిపివేయాలని సూచించారు. జిల్లాలో 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుందన్నారు. నేటి సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, పార్టీలు సభలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని చెప్పారు. 29, 30 తేదీల్లో దినపత్రికలు, టీవీ చానళ్లలో ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. బల్క్ మెసేజ్‌లు, సోషల్ మీడియాల్లో సైతం ఎలాంటి ప్రకటనలు ఇవ్వడానికి అనుమతి లేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వ్యక్తులు నేటి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాను విడిచివెళ్లాలని సూచించారు. డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, డీఆర్‌ఓ రవీంద్రనాథ్, డీపీఆర్ ఓ ఎస్.శ్రీనివాసరావు, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఐఈఓ సులోచనారాణి, యువజన సర్వీసుల అధికారి పరంధామరెడ్డి, డీఎస్‌ఓ రుక్మిణి, సివిల్ సప్లై డీఎం త్రినాథ్‌బాబు, సీపీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈవీఎంల తరలింపునకు హాజరుకావాలి
ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలు, ఇతర పోలింగ్ మెటీరియల్‌ను పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలకు తరలింపులో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనాలని ప్రియాంక ఆల కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు కమల్‌కిషోర్, గణేష్, వ్యయ పరిశీలకులు అజయ్‌లాల్‌చంద్ సోనే, పోలీస్ అబ్జ ర్వర్లు స్వపన్ సర్కార్, జయంత్‌సింగ్, ఎస్పీ డాక్టర్ వినీత్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దాటి అనుమతి లేదని చెప్పారు. మెటీరియల్ పంపిణీ, ఈవీఎంల తరలింపు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ప్రతినిధులు లక్ష్మణ్ అగర్వాల్, నోముల రమేష్, సత్యనారాయణ, జమలయ్య పాల్గొన్నారు.
జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేశాం
పోలింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులు సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు.