జలగం రూటే సపరేటు ! | - | Sakshi
Sakshi News home page

జలగం రూటే సపరేటు !

Jul 26 2023 10:16 AM | Updated on Jul 26 2023 5:26 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జలగం కుటుంబానిది ప్రత్యేక స్థానం. ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక రంగం పురోగతికి వెంగళరావు ఎంతో కృషి చేశారు. ఆయన వారసుడిగా జలగం వెంకట్రావు రాజకీయాల్లో ప్రవేశించారు. సమకాలీన నాయకులతో పోల్చితే వెంకట్రావు వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. మాటలు తక్కువ.. చేతలు ఎక్కువ అన్నట్టుగా ఉంటారాయన.

ఎప్పుడూ ప్రశాంతంగానే..
ఎమ్మెల్యే పదవిలో ఉన్నా, ఓడిపోయినా వెంకట్రావు ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తారు. ఆవేశపూరిత ప్రంసగాలకు దూరంగా ఉంటారు. ప్రత్యర్థులు తనపై చేసే విమర్శలకు సైతం పెద్దగా స్పందించరు. ప్రజా స్వామ్యంలో అది వారి హక్కు అన్నట్టుగా ఉంటారు. అవసరమైతే తప్ప ప్రజలతో కలిసేందుకు కూడా సుముఖంగా ఉండరు. అనవసరంగా షో చేయడం ఎందుకని అనుచరులతో అంటుంటారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత క్యాంప్‌ ఆఫీసు కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచించిన సందర్భాలు తక్కువే. అయినా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని వెంకట్రావు కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకోగలిగారు. మాటలు తక్కువైనా పని చేయడంలో దిట్ట అనే నమ్మకాన్ని కల్పించారు. అందుకే జలగం ఉన్నా లేకున్నా ఆయన కోసం పని చేసే కార్యకర్తలను తయారు చేసుకోగలిగారు.

ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి పనులు..
ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలోనే కొత్తగూడెం భవిష్యత్‌ కోసం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. సింగరేణి బొగ్గు గనులు తగ్గుతున్న తరుణంలో ‘గూడెం’ ప్రాభవం తగ్గకుండా పనులు చేశారు. పోలీస్‌ బెటా లియన్‌, ఏకలవ్య పాఠశాల, ఇంగ్లిష్‌ మీడి యం స్కూల్‌, అక్షయపాత్ర భోజనం, మైక్రోసాఫ్ట్‌తో విద్యార్థులకు ట్యాబులు వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా రు. జిల్లాను టూరిజం హబ్‌గా చేసేందుకు సెంట్రల్‌ పార్క్‌, హరిత హోటల్‌, కిన్నెరసాని రిసార్ట్స్‌, కిన్నెరసాని హౌజ్‌బోట్‌ థీమ్‌లను తెర మీదకు తెచ్చారు. ఎయిర్‌పోర్టు విషయంలో కదలిక తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అంతేకాదు మూత పడిన స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారం రేపో మాపో పునఃప్రారంభం అవుతుంది అన్నంతగా పని చేశారు. వరంగల్‌, ఖమ్మం వంటి నగరాలకు దీటుగా కొత్తగూడెంలో పార్కింగ్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మా ణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు.

పక్కా ప్రణాళికతో..
ఏ అంశాన్ని చేపట్టినా లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయడం, ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకోవడం వెంకట్రావుకు వెన్నతోపెట్టిన విద్య. దీన్ని అన్ని విషయాల్లోనూ అమలు చేస్తుంటారు. ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపిన అంశాలను మిగిలిన రాజకీయ నాయకులు చూసీ చూడనట్టుగా వదిలేస్తారు. కానీ జలగం అలా కాకుండా అందులోని అంశాలన్నీ పరిశీలించారు. చివరకు నీటి బిల్లు, ట్రాఫిక్‌ చలాన్‌ వంటి అంశాలనూ పక్కాగా పొందు పరిచి కేసు ఫైల్‌ చేశారు. చివరకు అనుకున్న ఫలితం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement