ఏఎన్‌యూ (పెదకాకాని): మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడంతో పాటు విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏఎన్‌యూ, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా కదిలాయి. ఈ మేరకు మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాలేజ్ సమ్మిట్–2026 నిర్వహించాయి. ఈ సదస్సుకు ఏఎన్‌యూ అనుబంధ కళాశాలల ప్రిన్సి పాల్స్, శిక్షణ, నియామక విభాగాల అధికారులు (టీపీఓలు), పరిశ్రమల నిపుణులు, విద్యావేత్తలు, యువత అభివృద్ధి రంగ ప్రతినిధులు హాజరయ్యా రు. ముఖ్య అతిథిగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ జాతీయ డైరెక్టర్ శ్రీసాయి కుల్తుంగన్ మాట్లా డుతూ సంస్థ కార్యకలాపాలు, లక్ష్యాలను వివరించారు. ఏఎన్‌యూ ఉపకులపతి ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సును కేవలం ఉద్యోగ రంగాన్ని ప్రభావితం చేసే విఘాతకర సాంకేతికతగా చూడకూడదని, అది నిత్యజీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, డాక్టర్ ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్, ప్లేస్‌మెంట్ విభాగం ప్రతినిధి ఎన్.వి.సురేంద్రబాబు, సర్ సీఆర్ రెడ్డి విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ కిషన్ పూర్ణ చంద్ర కాజా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ డాక్టర్ ఆర్. హఫీజ్ బాషా, జీఎన్‌ఐవైడీ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ షేక్ సల్మాన్ అష్రఫ్ పాల్గొన్నారు.


