నాదెండ్ల: తల్లిదండ్రులు నిత్యం ఇంట్లో గొడవ పడుతుండడంతో మనస్తాపం చెందిన కుమారుడు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇర్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కట్టా వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు ఇర్లపాడు గ్రామానికి చెందిన చీదరబోయిన శ్రీనివాసరావు దంపతుల కుమారుడు చీదరబోయిన నరేంద్ర (19) తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇరువురూ తరచూ గొడవ పడుతుండటంతో పలుమార్లు వారికి నచ్చజెప్పాడు. వారు వినకపోవటంతో మనస్తాపానికి గురైన నరేంద్ర ఈ నెల 11న ఇంట్లోని ఎలుకల పేస్ట్ తిన్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన నరేంద్రను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించటంతో స్వగ్రామానికి తరలించారు. తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లి హత్య కేసులో కుమారుడు అరెస్ట్
ముప్పాళ్ల: మండలంలోని మాదల గ్రామంలో ఈనెల 14వ తేదీన కన్న తల్లిని కర్కశంగా గొంతు కోసి హత్య చేసిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎమ్.వి.కృష్ణచైతన్య సోమవారం సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడివిపాలెంకు చెందిన ఆకుల సీతారావమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు ఆకుల మహంకాళిరావును భార్య వదిలి వెళ్లి పోయింది. ఈ క్రమంలో తన భార్యతో మాట్లాడి కాపురానికి తీసుకురావాలంటూ తల్లిని ఇబ్బంది పెడుతుండేవాడు. ఆ బాధలు భరించలేక తల్లి చిన్న కొడుకుతో కలసి కర్రతో పెద్దకొడుకుని కొట్టి చంపటంతో సంతమాగులూరు పోలీస్‌స్టేషన్‌లో నాలుగేళ్ల కిందట కేసు నమోదైంది. చిన్న కొడుకుతో కలిసి జైలుకు వెళ్లింది. జైలు నుంచి వచ్చిన తర్వాత చిన్న కొడుకు ఆకుల అక్షయ్ అజయ్ అలియాస్ బాజీ భార్య కూడా విభేదాలతో పుట్టింటికి వెళ్లింది. కాపురానికి తీసుకురావాలంటూ బాజీ తల్లి సీతారావమ్మను వేధిస్తూ ఉండేవాడు. తీసుకురాకపోతే చంపుతానంటూ బెదిరిస్తుండటంతో వేధింపులు తట్టుకోలేక సీతారావమ్మ వారం రోజుల కిందట అడివిపాలెం వదిలి మాదల గ్రామానికి వచ్చింది. సీతారావమ్మ పెద్ద కోడలు స్వయానా మేనకోడలు కావటంతో ఆమె వద్దే ఉంటుంది. విషయం తెలుసుకున్న బాజీ మాదల గ్రామానికి వచ్చి ఆచూకీ తెలుసుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో సీతారావమ్మ ఒంటరిగా ఉండగా మెడకు టవల్ వేసి చంపటానికి ప్రయత్నించాడు. ప్రయత్నం ఫలించకపోవటంతో ఇంట్లో ఉన్న పదునైన చాకుతో పీకకోసి పారిపోయాడు. ఈ ఘటనపై పెద్దకోడలు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేర సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ దర్యాప్తు చేపట్టి హత్యకు పాల్పడిన బాజీని మాదల గ్రామ శివారులో అదుపులోకి తీసుకొని సత్తెనపల్లి మొదటి అదనపు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.


