కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
కారంచేడు: జిల్లాలో మొదటి విడతగా జరగనున్న పంచాయతీ ఎన్నికల నియమావళిని అన్ని శాఖల అధికారులు, అభ్యర్థులు తప్పకుండా పాటించాల్సిందేనని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వీ వినోద్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన మండలంలోని కేశవరప్పాడు, స్వర్ణ గ్రామాల్లో జరుగుతున్న గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియతో పాటు, ఎన్నికలు జరిగే కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను ఆయన తనిఖీలు చేపట్టారు. నామినేషన్ల విషయంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల జరిగే కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. తాగునీటి వసతులు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలను కూడా ఆయన తనిఖీ చేశారు. 17వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవడానికి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు సమయం ఉందన్నారు. ఈ నెల 26వ తేదీన ఉదయం నుంచి పోలింగ్, మధ్యాహ్నం నుంచి లెక్కింపు ఉంటుందన్నారు. మండల పరిధిలో ఎన్ని గ్రామాలున్నాయి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు విషయాలను ఆయన సంబంధిత అదికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ నరశింహారావు, కారంచేడు తహసీల్దార్ ఎం మాధవీలత, ఎంపీడీఓ కే నేతాజీ, ఆయా గ్రామాల ఎన్నికల అధికారులు, సిబ్బంది, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.


