చీరాల నియోజకవర్గంలో జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

చీరాల నియోజకవర్గంలో జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

చీరాల నియోజకవర్గంలో జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు

ఇసుక దందా డబ్బులే స్థానిక సంస్థల ఎన్నికలకు పెట్టుబడి ? జీఓ ఇచ్చినా జోరు తగ్గని కూటమి నేతల ఇసుక దందా చీరాల నియోజకవర్గంలో ఉచిత ఇసుక హుళక్కే హైకోర్టు కొరడా ఝుళిపించినా రాత్రిళ్లు ఆగని తవ్వకాలు అడిగేవారెవరూ..? ఆపేవారెవరూ..?

చీరాల: సామాన్య, మధ్య తరగతి ప్రజల నిర్మాణ అవసరాలకు వినియోగించే ఇసుక అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత అనుచరులకు ఆదాయ వనరుగా మారింది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తున్నామని చెబుతున్నా చీరాల నియోజకవర్గంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై హెచ్చరికలు చేసినా వాటిని బేఖాతరు చేస్తూ ఇసుక అక్రమార్కులు ‘తగ్గేదేలే’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాలపై హైకోర్టు కొరడా ఝుళిపించినా అవేమీ మా దగ్గరకు రాలేవనే ధీమాతో అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇసుక దందాలో సంపాదించిన డబ్బునే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు కొనుగోలుకు పెట్టుబడిగా వినియోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యథేచ్ఛగా తవ్వకాలు

చీరాల నియోజకవర్గంలో చీరాల, వేటపాలెం మండలాల్లో సువిశాలమైన తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతాల గ్రామాల పరిధిలోని భూముల్లో ఇసుక ఎక్కువగా లభించడంతో అధికార పార్టీ అనుచరులకు అది కల్పతరువుగా మారింది. అసైన్డ్‌ భూముల్లో ఇష్టారాజ్యంగా ఇసుక కొల్లగొడుతూ జేబులు నింపుకొంటున్నారు. చీరాల మండలంలోని కావూరివారిపాలెం, బోయినవారిపాలెం, వేటపాలెం మండలంలోని పుల్లరిపాలెం, పందిళ్లపల్లి, నాయినిపల్లి తదితర ప్రాంతాల్లో ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. చీరాల మండలం సుమారు 80 ఎకరాల్లో అసైన్డ్‌ భూముల్లో అడ్డూఅదుపు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టారు. అసైన్డ్‌ భూముల్లో సుమారు 40 అడుగుల మేర ఇసుక తవ్వకాలు చేయడంతో ఆ ప్రాంతమంతా చెరువుల్లా మారుతున్నాయి. అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులు యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.

రాత్రిళ్లు తవ్వకాలు.. పగలు తరలింపు

వేటపాలెం మండలం బొచ్చులవారిపాలెం గ్రామ శివారు భూముల్లో రాత్రిళ్లు ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారాా తరలిస్తున్నారు. ఉదయం ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రి 7 గంటల తర్వాత ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో సుమారు పది అడుగుల మేర ఇసుక తవ్వారు. అలాగే పందిళ్లపల్లిలోని పోలేరమ్మ గుడిపక్క నుంచి రైల్వేట్రాక్‌ పడమర వైపున సుమారు 20 ఎకరాల్లో అసైన్డ్‌ భూముల్లో ఇసుక కొల్లగొడుతున్నారు. రాత్రి పూట మొదలుపెట్టి ఉదయం 7 గంటల వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించి ఒక ప్రాంతంలో డంప్‌ చేస్తున్నారు. అనంతరం టిప్పర్లు, లారీల ద్వారా సమీప ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకుని నిలుపుదల చేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. పుల్లరిపాలెం నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా బచ్చులవారిపాలెం మీదుగా తరలిస్తున్నారు. రాత్రిళ్లు ట్రాక్టర్ల శబ్దాలతో కంటి మీద కునుకు లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. 2024లో ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం అమలు చేసింది. అయితే చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రకటించిన అధీకృత ఇసుక రీచ్‌ల జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో 2024 జూలై మొదటి వారంలో వేటపాలెం మండలం నాయినిపల్లి పరిధిలో ప్రభుత్వ ఉచిత ఇసుక డిపోను ఏర్పాటు చేశారు. రీచ్‌లు ఉన్న ప్రాంతాల నుంచి ఇసుకను డంప్‌ చేశారు. ఏమైందో ఏమో కానీ అది మూన్నాళ్ల ముచ్చటయ్యింది. కొద్ది రోజులకే డిపోను తీసేశారు.

ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా మైనింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై చీరాల మాజీ ప్రజాప్రతినిధి రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు. రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌, ఫారెస్ట్‌ శాఖల అధికారులతో పాటు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. పిల్‌ను స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. అయితే శాఖల అధికారులు తమది కాదంటే తమది కాదంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ, సంబంధిత శాఖల అధికారుల వాదనలు అనంతరం ప్రభుత్వం ఈ నెల 6న 278 నెంబర్‌తో జీఓ విడుదల చేసింది. జీఓ విడుదల చేసినా ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా ఆగలేదు. ఇసుక దందాకు అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల వెనుక ఎవరున్నారు? వ్యవసాయ భూముల్లో ఇంత భారీ స్థాయిలో తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానం కరువైంది. ఇసుక అక్రమ రవాణా గురించి అంతా తెలిసిన మండల, డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులు అరికట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement