నదీ భద్రతకు గొడ్డలి పెట్టు | - | Sakshi
Sakshi News home page

నదీ భద్రతకు గొడ్డలి పెట్టు

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

నదీ భద్రతకు గొడ్డలి పెట్టు

కృష్ణానది గర్భంలో అక్రమంగా చెట్లు నరికివేత

ఏటిగట్టు కోతకు గురయ్యే ముప్పు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న రివర్‌ అండ్‌ కన్జర్వేటర్‌ యంత్రాంగం లంక గ్రామాల ప్రజల ఆందోళన

కొల్లూరు: కృష్ణా నది గర్భంలో చెట్ల అక్రమ నరకివేత తీర ప్రాంత వాసులను కలవరపాటుకు గురిచేస్తుంది. నదిలో సహజ సిద్ధంగా ఏర్పడి ఏటి గట్టు కోతకు గురవకుండా రక్షణ కవచంగా ఉన్న ప్రాంతంలో అక్రమార్కుల ఆగడాల కారణంగా సారవంతమైన లంక భూములు కోత బారిన పడటంతోపాటు, భవిష్యత్తులో గ్రామాలు నదీ పాలవుతాయన్న ఆందోళన లంక గ్రామాల ప్రజలను కలచివేస్తుంది. నదిలో ఏర్పడిన మెరక భూముల విషయంలో గత కొన్నేళ్ల క్రితం ఇరు గ్రామాల నడుమ తీవ్ర వివాదం ఏర్పడి కొట్లాటలకు దారి తీయడంతో కేసులు నమోదయ్యాయి. అప్పటి పరిస్థితుల కారణంగా ఆ భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు చేయరాదన్న అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న స్వార్ధపరులు నదీ అంచులకు రక్షణ కవచంలా ఎదిగిన చెట్లను తమ కల్ప వృక్షాలుగా భావిస్తూ, వాటిని నరకి కలప అమ్ముకొని సొమ్ములు మూటగట్టుకుంటూ లంక గ్రామాల భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు.

చూసీచూడనట్లు అధికారులు..

నదీ గర్భంలో చెట్ల నరికివేత వ్యవహారంపై ఫిర్యాదులు అందినా రివర్‌ అండ్‌ కన్జర్వేటర్‌ (ఆర్‌సీ) యంత్రాంగం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవరిస్తుండటంతో గత వివాదం తిరిగి ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మండలంలోని పెదలంక అరవిదం వారధి దిగువున కాలక్రమేణా కృష్ణా నదిలో సహజసిద్ధంగా బుసక, మట్టితో కూడిన మెరక ఏర్పడింది. ఆ ప్రాంతంలో తుప్పలు, చెట్లు, చేమలు పెరిగి చిట్టడివిని తలపిస్తూ నది అంచున పొలాలు వరదల సమయంలో కోతల భారిన పడకుండా రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. ఆ భూముల విషయంలో నాలుగేళ్ల క్రితం భూములు లేని ఎస్సీ వర్గీయులకు పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో భూముల చదును చేసే ప్రక్రియ చేపట్టడంతో వివాదం తలెత్తి కొట్లాటలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో అధికారులు నదీ తీరం రక్షణగా ఉన్న భూముల జోలికి ఎవ్వరూ వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం కొద్ది రోజులుగా అ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అధికారుల ఆదేశాలకు విరుద్దంగా, ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లను నరికి అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. అరవింద వారధి దిగువన జరుగుతున్న అక్రమ చెట్ల నరికివేత విషయంపై అటు ఆర్‌సీ, ఇటు రెవెన్యు అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని, పట్టపగటే అక్రమార్కులు చెట్ల నరికివేత చేపట్టి కలప తరలించుకుపోతున్నారన్న ఆందోళనకు లంక వాసులు గురవుతున్నారు. తక్షణం అధికారులు స్పందించి నదీ గర్భంలోని భూములలో అక్రమ కార్యకలాపాలను నిలువరించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement