చీరాల రూరల్: చీరాల–పేరాల వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజులు క్రితం చీరాల బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద ప్రారంభించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు సోమవారం రాత్రితో ఉత్సాహంగా ముగిశాయి. మూడు రోజలు పాటు ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 క్రీడా జట్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. పోటీల్లో గెలుపొంది విజేతలుగా నిలిచేందుకు అన్ని జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మెరుగైన ప్రదర్శన కనబరిచిన బేతపూడి రత్నారెడ్డి మెమోరియల్ జట్టు విజేతగా నిలిచి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. రెండో స్థానంలో విశాఖపట్నం జట్టు, మూడో స్థానంలో బాపట్ల జట్టు, నాలుగో స్థానంలో గుంటూరు ఎస్ఆర్ఎం జట్టు, ఐదో స్థానంలో చీరాల జట్టు నిలిచింది. పోటీల్లో గెలుపొందిన జట్లకు నిర్వాహకులు యండ్రపాటి రత్నరాజు, కూచిపూడి తిమోతి, యండ్రపాటి సురేష్‌లు మొదటి నుంచి ఐదు బహుమతులు వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు అందజేశారు. బెస్ట్ డిఫెన్స్, బెస్ట్ ఎఫెన్స్, బెస్ట్ సెట్టర్లకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలానే చీరాలలో పూర్వ వాలీబాల్ క్రీడాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.


