కూటమి ఓటింగ్ చీలకుండా ఉండేందుకే బరిలోకి ‘అన్నం’ వర్గం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజా బలాన్ని అడ్డుకోలేరు అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: బాపట్ల మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్ సీపీ అభ్యర్ధి కాగిత సుధీర్‌బాబును బలపరుస్తూ పార్టీ శ్రేణులు భారీ ప్రదర్శనగా నామినేషన్ కార్యక్రమానికి సోమవారం తరలివచ్చారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన మున్సిపల్ కార్యాలయం వరకు చేరుకుంది. పురవీధులన్నీ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయాయి. పార్టీ జెండాలతో తమ మద్దతును ప్రకటిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ విజయం తథ్యం
బాపట్ల మున్సిపాల్టీలో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థి కాగిత సుధీర్‌బాబు (యజ్రయ్య)విజయానికి సోపానంగా ఉంటాయని కోన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో మారుతున్న రాజకీయ సమీకరణలను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపీ నాయకుడు అన్నం సతీష్‌ప్రభాకర్ స్థానికేతరుడికి చైర్మన్ పదవి ఇచ్చారని పార్టీకి రాజీనామా చేయటం, అతను ప్రత్యేక ప్యానల్‌తో ముందురావటాన్ని ప్రజలు పరిశీలించాలని కోన సూచించారు. స్థానికేతరులు అంటూ చెప్పే అన్నం సతీష్ ప్రభాకర్ ప్రస్తుతం బరిలో ఉన్న స్థానికులకు అవకాశం ఇస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ప్యానల్ పెట్టడం చూస్తుంటే కూటమిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేక ఓటింగ్ చీలకుండా ఉండేందుకు ఇదో ఎత్తుగడగా కోన వివరించారు. అన్నం సతీష్ ప్రభాకర్ కూడా ఆపార్టీలోనే వ్యక్తేనని, ఇది ఓట్ బ్యాంక్ రాజకీయంగా ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్‌ను అడ్డుకోవటం ఎవరి వల్లకాదని, ఖచ్చితంగా వైఎస్సార్ సీపీనే విజయం సాధిస్తుందని కోన వివరించారు. వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి కాగిత సుధీర్‌బాబు(యజ్రయ్య), మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, మాజీ మున్సిపల్ ప్రతిపక్షనేత షేక్ సయ్యద్ పీర్, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, గేరా మణిభూషన్, వడ్డిముక్కల డేవిడ్, చింతల రాజశేఖర్, కొక్కిలిగడ్డ చెంచయ్య తదితరులు ఉన్నారు.


