‘అక్వాన్‌’ను ఎదుర్కొనేందుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘అక్వాన్‌’ను ఎదుర్కొనేందుకు సిద్ధం

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

రెండో విడత ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బాపట్ల: అక్వాన్‌ తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో సాధారణ సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, ఓటరు జాబితా సవరణ, తుఫాన్‌ ముందస్తు చర్యలపై అధికారులతో ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రధాన కాలువలు, డ్రైనేజీలలో పూడిక, అడ్డంకులను తక్షణమే తొలగించాలన్నారు. అవసరమైన చోట పొక్లెయిన్లు, ట్రాక్టర్లు వినియోగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్‌ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్‌ శాఖ సిబ్బంది ముందస్తుగా తొలగించాలన్నారు. తుఫాన్‌ సహాయక చర్యలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. సముద్రంలో ఉన్న పడవలు, ఇతర మత్స్యకార నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చి, లంగరు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ కేంద్రాల్లో ఆశ్రయం పొందిన అర్హులైన వారికి సహాయం అందేలా తహసీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలని ఆయన సూచించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తుల పెండెన్సీని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సమీక్షించారు.

నామినేషన్లు సజావుగా జరిగేలా చర్యలు

మున్సిపల్‌, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్‌ ప్రక్రియపై స్పష్టమైన సమాచారం అందించి, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను ముందుగానే తెలియజేయాలని ఆయన సూచించారు. మత్స్యశాఖ జేడీ శ్రీనివాస్‌ నాయక్‌, డీడీ గాలి దేముడు, డ్వామా పీడీ విజయ లక్ష్మి, సర్వ శిక్ష అభియాన్‌ పీడీ శ్రీనివాసులు, కలెక్టరేట్‌ ఏఓ మల్లికార్జున రావు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ సమన్వయ అధికారి యశ్వంత్‌ పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం...

బాపట్ల: బాపట్ల మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ముగింపు రోజైన సోమవారం బాపట్ల మున్సిపల్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు స్వేచ్ఛగా తమ నామినేషన్‌ వేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం వరకు 164 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. బాపట్ల ఆర్డీఓ హరికుమార్‌, బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ హాసిని ఉన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: జిల్లాలో రెండో దశలో పంచాయతీ ఎన్నికల షెడ్యుల్‌ను విడుదల చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో దశలో వేటపాలెం, చీరాల, అమృతలూరు, చుండూరు, వేమూరు, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని మొత్తం 113 గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్‌ మేరకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

నామినేషన్లు: నవంబర్‌ 18 నుంచి 20 వరకు

పరిశీలన: నవంబర్‌ 21

ఉపసంహరణ: నవంబర్‌ 24

పోలింగ్‌: నవంబర్‌ 29 (ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు)

ఓట్ల లెక్కింపు: నవంబర్‌ 29 మధ్యాహ్నం 2 గంటల నుంచి

రీపోలింగ్‌: నవంబర్‌ 3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement