నామినేషన్‌కు అవకాశం కల్పించాలంటూ ఆందోళన | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌కు అవకాశం కల్పించాలంటూ ఆందోళన

Nov 17 2026 1:44 AM | Updated on Nov 17 2026 1:44 AM

నామినేషన్‌కు అవకాశం కల్పించాలంటూ ఆందోళన డిసెంబరు 12 నుంచి బీఈడీ వన్‌టైం పరీక్షలు కారంచేడు పీహెచ్‌సీని సందర్శించిన కేంద్ర బృందం గిరిజన బాలికల వసతి గృహం వద్ద ఉద్రిక్తత

రొంపిచర్ల: నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ మండలంలోని కర్లకుంటలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆదివారం నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించగా సోమవారం అవకాశం కల్పిస్తామని పోలీసులు చెప్పారని, ఈ రోజు కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన వీధిలో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. నామినేషన్లు వేయకుండా పోలీసులే అడ్డుకోవడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాకు వచ్చిన హక్కును పోలీసులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్‌ స్పందించి నామినేషన్‌ దాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బుచ్చిపాపన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మద్దతు సర్పంచ్‌ అభ్యర్థి, వార్డు సభ్యులు పోలీసు బందోబస్తు మద్య కర్లకుంటలో నామినేషన్‌ దాఖలు చేశారు. పోలీసులు ప్రత్యేకంగా వ్యాన్‌లో అభ్యర్థులను తీసుకువచ్ని నామినేషన్‌ దాఖలు చేయించారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ పరిధిలో డిసెంబరు 12వ తేదీ నుంచి బీఈడీ వన్‌టైం పరీక్షల నిర్వహణకు వర్సిటీ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ ఏడాది జులై 13వ తేదీన నిర్వహించాల్సిన బీఈడీ వన్‌టైమ్‌ పరీక్షలు నాలుగు నెలలు గడుస్తున్నా నిర్వహించకపోవడంతో ఏఎన్‌యూ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పంతగాని రమేష్‌ అధికారుల నిర్లక్ష్యంగానే పరీక్షలు సకాలంలో జరగడం లేదని ఆరోపించారు. వర్సిటీ పరిధిలో బీఈడీ వన్‌టైం పరీక్షలు వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మే నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసి జూలై 13న నిర్వహించాల్సిన వన్‌ టైం పరీక్షలను నిర్వహించకపోవడంతో విద్యార్థులు నష్టపోయారని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం పేర్కొంది. డిసెంబర్‌ 12 నుంచి నిర్వహిస్తున్నట్లు సోమవారం షెడ్యూల్‌ విడుదల చేశారని ఏఎన్‌యూ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పంతగాని రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కారంచేడు: గ్రామాల్లోని పేద ప్రజలకు అవసరమైన నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేయాలని నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ స్టాండెడ్స్‌ (ఎన్‌కాస్‌) జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల కేంద్రం బృందం సభ్యులు డాక్టర్‌ విక్రాంత్‌, డాక్టర్‌ సుశీల్‌ సూచించారు. సోమవారం కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో మందుల నాణ్యత, పరిశుభ్రత, రోగుల భద్రత, వారికి అందించే సేవలు ఎలా ఉండాలి అనే అంశాలపై వారు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పీహెచ్‌సీ ప్రాంతం, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. వైద్య సిబ్బంది అందించే అన్ని సేవలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం వెంట డాక్టర్‌ జీ సురేష్‌బాబు, డాక్టర్‌ పృధ్వీరాజ్‌, డాక్టర్‌ సాయిప్రశాంతి, వైద్య సిబ్బంది ఉన్నారు.

బాపట్ల: బాపట్ల పట్టణంలోని మున్సిపల్‌ హైస్కూల్‌ సమీపంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ సమీకృత బాలికల వసతి గృహంలో విద్యార్థినుల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల మధ్య వివాదం తల్లిదండ్రుల వరకు చేరడంతో ఇరువర్గాలకు చెందిన తల్లిదండ్రులు హాస్టల్‌ వద్దకు వచ్చి భౌతికదాడులకు పాల్పడిన సంఘటన ఆదివారం, సోమవారాలలో జరిగింది. దుస్తులు ఉతుకుతుండగా నీళ్లుపడిన విషయంలో చెలరేగిన వివాదం చివరికి పోలీసుస్టేషన్‌ వద్ద చేరింది. ఆదివారం ఈవిషయంలో పోలీసులు సర్దిచెప్పి పంపగా మళ్లీ సోమవారం వివాదానికి దారి తీసింది. డీఈఓ శ్రీనివాససింగ్‌ జోక్యం చేసుకని ఇరువర్గాలకు సర్ధిచెప్పి సమస్యను పరిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement