మధుమేహం.. మేల్కొంటేనే భద్రం | - | Sakshi
Sakshi News home page

మధుమేహం.. మేల్కొంటేనే భద్రం

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

వ్యాధికి కారణాలు...

షుగర్‌ బారిన పడుతున్న పిల్లలు, యువత ఆధునిక జీవనశైలితో పెరుగుతున్న బాధితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం

గుంటూరు మెడికల్‌ : చిన్నపిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా ఆధునిక జీవనశైలి కారణంగా నేడు చాలా మంది షుగర్‌ వ్యాధి బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, 1980లో ప్రపంచవ్యాప్తంగా షుగర్‌ బాధితులు 108 మిలియన్ల మంది ఉండగా, 2025 నాటికి 425 మిలియన్లకు చేరుకున్నారు. ప్రతి ఏడాది షుగర్‌ వ్యాధితో 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది నవంబర్‌ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం.

పిల్లల్లో వ్యాధి లక్షణాలు...

తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, దాహం వేయడం, ఆకలి పెరగడం, బరువు తగ్గిపోవడం, నీరసం, నిస్సత్తువ, రాత్రి వేళల్లో పిల్లలు పక్క తడపడం వంటి లక్షణాలు షుగర్‌ వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. ఈ లక్షణాలను పిల్లల్లో గమనిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి నిర్ధారణ అయితే పిల్లలకు జీవితాంతం ఇన్సులిన్‌ వాడాల్సి ఉంటుంది.

పెద్దవారిలో ఇలా...

పెద్దవారిలో షుగర్‌ వ్యాధి సోకితే అధికంగా దాహం వేస్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తారు. చూపు మసకబారుతుంది. బాగా అలసిపోతారు. కొంతమందిలో శృంగార కోరికలు తగ్గుతాయి. మరికొందరికి కాళ్లలో స్పర్శ తగ్గిపోతుంది. కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. అతిగా ఆకలి వేయడం, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, ఆయాసం, వాంతులు, విరేచనాలు, జననేంద్రియాల వద్ద ఇన్‌ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జిల్లాలో బాధితులు....

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా 2025–26లో జిల్లా వ్యాప్తంగా షుగర్‌ వ్యాధి బాధితుల గుర్తింపు కోసం సర్వే నిర్వహించారు. జిల్లాలో 18 సంవత్సరాలు దాటిన జనాభా 18,34,963 మంది ఉండగా... వీరిలో 10,84,492 మందికి షుగర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 80,495 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది.

పిల్లల్లో మధుమేహం రావడానికి ప్రధాన కారణాల్లో ఇన్‌ఫెక్షన్లు ఒకటి. శరీరంలో ప్యాంక్రియాస్‌ అనే అవయవం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ వల్ల ప్యాంక్రియాస్‌ దెబ్బతిని ఇన్సులిన్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో వ్యాధి వస్తుంది. పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాలు, జంక్‌ఫుడ్‌ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, బరువు పెరగడం, స్థూలకాయం, మానసిక ఒత్తిడికి గురవడం వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది. పెద్దవారిలో జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు, ఒత్తిడి వంటి కారణాలతో షుగర్‌ వ్యాధి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement