మధుమేహం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చు. వ్యాధి సోకిన వారు తప్పనిసరిగా వైద్యుల సలహాలు పాటిస్తూ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మందులతోపాటు వ్యాయామం కూడా చాలా కీలకం. కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ బాధితులు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే తీసుకునే ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. బరువు తగ్గడం ద్వారా షుగర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది.
– డాక్టర్ నందిపాటి వెంకటసందీప్, ఎండోక్రైనాలజిస్ట్, గుంటూరు.
షుగర్ వ్యాధి నియంత్రణలో భాగంగా ఎన్‌సీడీ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా ఉచితంగా షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వైద్య పరీక్షల్లో షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నాం. వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. వ్యాధి సోకకుండా ఉండాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేయాలి. నిర్ణీత వేళలకు పోషకాహారం, మితాహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌కు, ఒత్తిడికి దూరంగా ఉండాలి. తగినంత నిద్రపోవాలి. నూనె పదార్థాలు, ఉప్పు తగ్గించి తీసుకోవాలి. స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ వంటి చక్కెర అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
– డాక్టర్ మక్కెన పద్మావతి, డీఎంహెచ్‌ఓ, గుంటూరు
గతంలో షుగర్ వ్యాధి వచ్చిన వారు ఐదు నుంచి ఏడేళ్లలో కిడ్నీలు ఫెయిల్ అవడం, డయాలసిస్ చేయించుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొని మరణించేవారు. షుగర్ వల్ల వచ్చే కిడ్నీ సమస్యలకు సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో మరణాలు సంభవించేవి. ప్రస్తుతం షుగర్ వ్యాధి చికిత్సకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. సెల్టాటిన్ ఇన్‌హిబిటర్స్, ఫినిరినోన్, జీఎల్‌పీ–1 వంటి మూడు రకాల మందులు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. షుగర్ బాధితులు ఈ ఆధునిక మందులను వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ద్వారా షుగర్‌ను నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా, షుగర్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బులను నివారించడంతోపాటు కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. అయితే, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు పాటించాలి.
– డాక్టర్ చింతా రామకృష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు


