పట్నంబజారు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫెరెన్స్ హాలులో శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ 24వ బ్యాచ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి డి.సాంబ్రాంజ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంబ్రాంజ్యం మాట్లాడుతూ నూతన బ్యాచ్ ప్రారంభానికి వచ్చిన డ్రైవర్లు క్రమశిక్షణతో హెవీ డ్రైవింగ్ నేర్చు కోవాలని సూచించారు. సుమారు 30 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ డ్రైవర్లతో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. 27వ బ్యాచ్‌కు సంబంధించి ప్రవేశం కోసం 8897371009, 7382894585 నంబర్లకు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో హెవీ డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.గురువారెడ్డి పాల్గొన్నారు.
హత్య కేసులో
నిందితుడికి జీవిత ఖైదు
గుంటూరులీగల్: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ మూడవ జిల్లా కోర్టు న్యాయమూర్తి శీలంకుర్తి వెంకట నాగశ్రీనివాసరావు శుక్రవారం తీర్పు చెప్పారు. రూ.వెయ్యి జరిమానా విధించారు. చేబ్రోలు గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా, శుద్ధపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరి గోపయ్య అలియాస్ గోపి ఇద్దరూ స్నేహితులు. వీరు తాపీ పని నిమిత్తం కలిసి వెళ్తుండేవారు. ఈ క్రమంలో గోపయ్యకు తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానం నిందితుడు నాగుల్ మీరాలో ఏర్పడింది. ఈ అనుమానంతో ఆగ్రహానికి గురైన నాగుల్ మీరా, గోపయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటనపై శుద్ధపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషనన్‌లో కేసు నమోదు చేశారు. కేసులో పోలీసుల దర్యాప్తు, సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం మూడవ జిల్లా కోర్టు న్యాయమూర్తి శీలంకుర్తి వెంకట నాగశ్రీనివాసరావు నిందితుడు షేక్ నాగుల్ మీరాకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన్నీరు సాంబశివరావు వాదనలు వినిపించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల వినియోగంపై సోమవారం నిర్వహించేందుకు తలపెట్టిన గ్రాండ్ల ఆడిట్ ప్రక్రియను వాయిదా వేయాలని గుంటూరు జిల్లా ఫ్యాప్టో ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషాను డీఈఓ కార్యాలయంలో కలిసిన ఫ్యాప్టో ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పీవో, ఏపీవో విధుల్లో ఉన్న గుంటూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణా తరగతులు జరగనున్న దృష్ట్యా ఆడిట్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు, జిల్లా ఫ్యాప్టో డెప్యూటీ సెక్రటరీ జనరల్ వై.శ్యాంబాబు, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, ఫ్యాప్టో జిల్లా నాయకులు జి.వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


