అనారోగ్యంతో మృతి స్వస్థలం నేలపాడులో అంత్యక్రియలు నివాళి అర్పించిన పలువురు కళాకారులు
తెనాలి: కళల తెనాలికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, సీ్త్ర పాత్రల్లో విశేషంగా రాణించిన మండే జవహర్‌బాబు (75) మృతిచెందారు. వయోభారంతో భట్టిప్రోలు మండలం ఐలవరంలో తన ఏకై క కుమార్తె ఇంటివద్ద ఉంటున్న జవహర్‌బాబు కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈనెల 10వ తేదీన అక్కడే చివరి శ్వాస తీసుకున్నారు. భార్య అంతకుముందే కాలంచేశారు. ఆయన భౌతికకాయాన్ని స్వస్థలమైన తెనాలి రూరల్ మండల గ్రామం నేలపాడుకు 11వ తేదీన తరలించారు. అదేరోజున అంత్యక్రియలు చేశారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, దాతలు సీహెచ్ విద్యావతి, పాటిబండ్ల వెంకటేశ్వర్లు సమకూర్చిన ఆర్థికసహాయాన్ని సంఘం కోశాధికారి మేరిగ రామలింగేశ్వరరావు, వర్కింగ్ కార్యదర్శి కనపర్తి మధుకర్‌లు ఆ కుటుంబానికి అందజేశారు. కళాకారుల సంఘం కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, కళాకారులు చిట్టూరి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
రంగస్థలంపై సీ్త్ర పాత్రలో దశాబ్దాలపాటు రాణించిన జవహర్‌బాబు నేలపాడులోని ఒక సాధారణ కుటుంబంలో 1950లో జన్మించారు. చదువు పెద్దగా లేకపోవటంతో భుక్తి కోసం తెనాలిలోని అశోక పెన్‌వర్క్స్‌లో కొంతకాలం పనిచేశారు. ప్రవృత్తిగా నాటకం కేసి చూశాడు.తీర్చిదిద్దిన ముఖవర్చస్సు, చక్కని రంగు, కోమలమైన కంఠస్వరం కలిగిన జవహర్‌బాబు సీ్త్ర పాత్ర పోషణకే జన్మించారా? అన్నట్టుగా ఉండేవారు. యుక్తవయసులోనే పాలేరు నాటకంలో సీ్త్ర పాత్రలో నటించారు. ఆ తర్వాత రక్తజ్వాల, శాంతిజ్యోతి, వరకట్నాలు, పూలరంగడు, రక్తపిపాసి వంటి సాంఘిక నాటకాలు, క్రీస్తు గాథను తెలియజేసే రక్తబలి, తప్పిపోయిన కుమారుడు నాటకాల్లో విభిన్న పాత్రల్లో నటించి గుర్తింపును సాధించారు.
పెన్‌వర్క్స్‌లో పనిచేస్తుండగా ఒక పర్యాయం పౌరాణిక పద్యనాటకం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటకంలో ముత్తి అనే సీ్త్ర పాత్రలో మెప్పించారు. దీనితో పౌరాణిక నాటకరంగం ఆయనకు స్వాగతం పలికింది. బాలనాగమ్మలో సంగు, చింతామణిలో రాధ, హరిశ్చంద్రుడు నాటకంలో మాతంగి, కలహకంఠి, చంద్రమతి పాత్రల్లో నటించారు. మాతంగి, కలహకంఠి పాత్రల్లో జీవించిన జవహర్‌బాబు ఎనలేని కీర్తిని సంపదించుకున్నారు. ముఖ్యంగా కలహకంఠి అనే గురువు భార్యగా ఆ సంప్రదాయపు కట్టుబొట్టు, భాషతో అచ్చంగా బ్రాహ్మణ సీ్త్రని తలపించేవారు. సంప్రదాయ నాటకంలో ఎక్కడా అపభ్రంశకు, అశ్లీలతకు తావులేకుండా వ్యవహరిస్తారని పేరు తెచ్చుకున్నారు. నాటి ప్రముఖ నటులు షణ్ముఖి ఆంజనేయరాజు, డీవీ సుబ్బారావు, వై.గోపాలరావు, రెంటచింతల శ్రీనివాసరెడ్డి, చీమకుర్తి నాగేశ్వరరావు, గూడూరు సావిత్రి, ఎం.విజయరాజు, కేవీ రెడ్డి, ఎ.దశరధరామయ్య, ఉప్పాల నాంచారయ్య, కేవీ శ్రీనివాసరావు, బి.రత్నకుమార్, బండారు రవికుమార్‌తోపాటు నేటి తరం నటులు ఉప్పాల రాజేశ్వరరావు, మేరిగె రామలింగేశ్వరరావు, డి.వెంకటసుబ్బయ్య, జూనియర్ డీవీ సుబ్బారావు, కె.మొలకారెడ్డి, మినగల్లు సుధాకర్, మార్తాటి కోటేశ్వరరావు వరకు రంగస్థల వేదికను పంచుకున్నారు. అయిదు దశాబ్దాల నటజీవితంలో ఆరువేలకు పైగా నాటకాల్లో నటించారు. నాటకాల్లో ఎంత హుందాగా, సౌమ్యుడిగా ఉండేవారో, నిజజీవితంలోనూ అదే రీతిలో జీవిస్తూ వచ్చారు. ఆయన మరణంతో తెనాలి గొప్ప కళాకారుడిని కోల్పోయినట్టయిందని పలువురు విచారం వ్యక్తంచేశారు.


