పర్చూరు(చినగంజాం): మండలంలోని గర్నెపూడి గ్రామంలోని మంచినీటి చెరువులో ఒక మొసలి ప్రత్యక్షమయింది. శుక్రవారం ఉదయం చెరువు గట్టు మీద నడుస్తున్న గర్నెపూడి గ్రామస్తులకు మొసలి చెరువులో సంచరిస్తూ కనబడింది. దీంతో గ్రామస్తులు బిగ్గరగా కేకలు పెట్టారు. వారి కేకలు విన్న గ్రామంలోని ప్రజలు చెరువు వద్దకు చేరుకున్నారు. ప్రజల అలజడితో మొసలి నీటిలోకి వెళ్ళిపోయింది. సమాచారం అందుకున్న గర్నెపూడి వీఆర్వో అనూష చెరువు వద్దకు చేరుకొని ఉన్నతాధికారులకు మొసలి సమాచారాన్ని అందించింది. దీంతో పర్చూరు తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఎస్‌ఐ పి.అంకమ్మరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అటవీ శాఖాధికారులకు సమాచారం తెలియజేశారు. మొసలి సుమారు 4 అడుగులు పొడవు ఉన్నట్లు ముందుగా దానిని చూసిన గ్రామస్తులు తెలపడంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్ళకుండా అధికారులు గ్రామంలో దండోరా వేయించారు. పశువులు, గొర్రెలు వాటి కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. చెరువు సమీపానికి గ్రామస్తులు వెళ్ళకుండా పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా మొసలి నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
భయాందోళనలో గ్రామ ప్రజలు


