సొంత నేతపైనే ‘రెడ్‌బుక్‌’ పడగ | - | Sakshi
Sakshi News home page

సొంత నేతపైనే ‘రెడ్‌బుక్‌’ పడగ

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

సొంత నేతపైనే ‘రెడ్‌బుక్‌’ పడగ

అర్ధరాత్రి అక్రమ అరెస్టుకు రంగంలోకి దిగిన ఖాకీలు బాపట్ల పార్లమెంటరీ టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కనగాలపై ప్రతాపం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతిస్తున్నారని అక్కసు ఓటమి భయంతో పోలీసులను ఉసిగొల్పిన టీడీపీ నేతలు అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు పోలీసుల విశ్వప్రయత్నం

కొల్లూరు: రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇప్పుడు పచ్చ పార్టీ నేతపైనే పడగ విప్పింది. ఖాకీలను ఉసిగొల్పి అర్ధరాత్రి అక్రమ అరెస్టు రూపంలో కాటు వేసేందుకు ప్రయత్నించింది. బాపట్ల జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు, తెనాలి రోటరీ క్లబ్‌ చైర్మన్‌, మాజీ ఎంపీపీ, రాష్ట్ర తెలుగు యువత మాజీ అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్‌ ప్రసాద్‌ను అక్రమ అరెస్టు చేసేందుకు తెగించడంతో కొల్లూరులో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ముదిరిన వర్గపోరు

పచ్చ పార్టీలో కొల్లూరుకు చెందిన ఒకే సామాజిక వర్గంలోని ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. మైనేని మురళీకృష్ణ వర్గం, కనగాల మధుసూదన్‌ ప్రసాద్‌ వర్గాల మధ్య కొన్నేళ్లుగా ఈ పోరు కొనసాగుతోంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే సమ ప్రాధాన్యం ఇవ్వలేదని కనగాల మధుసూదన్‌ ప్రసాద్‌ వర్గం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థిగా మధుసూదన్‌ ప్రసాద్‌ తన సతీమణితో నామినేషన్‌ దాఖలు చేయించడంతోపాటు, పలు ఎంపీటీసీ స్థానాల్లోనూ రెబల్‌ అభ్యర్థులను రంగంలోకి దించారు. అనంతరం జెడ్పీటీసీ స్థానాన్ని బీజేపీ దక్కించుకోవడంతో రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే, కొల్లూరు–3 సెగ్మెంట్‌లో టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న వ్యక్తిపై స్వతంత్ర అభ్యర్థి పోటీకి నిలిచారు. స్వతంత్ర అభ్యర్థికి మధుసూదన్‌ ప్రసాద్‌ అండగా నిలిచారనే అనుమానం టీడీపీ నాయకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఖాకీలను రంగంలోకి దించారు.

నగదు పంపిణీలో వివాదం..

ఓటర్లకు టీడీపీ ఒకవైపు నగదు పంపిణీ చేస్తున్న సమయంలోనే బుధవారం రాత్రి స్వతంత్ర అభ్యర్థి తరఫున నగదు పంపిణీ చేస్తున్న వ్యక్తులను మైనేని మురళీకృష్ణ అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థి తరఫున నగదు పంపిణీ చేస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలియడంతో ఆ ప్రాంతానికి వెళ్లిన మధుసూదన్‌ ప్రసాద్‌ను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతే ఎలాంటి వివాదం ఉండదని చెప్పడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికి మధుసూదన్‌ ప్రసాద్‌ ఇంటికి వెళ్లిన ఎస్‌ఐ కిశోర్‌బాబు తలుపు కొట్టడంతో ఆయన బయటకు వచ్చారు. వేమూరు సీఐ హఫీజ్‌ బాషా మాట్లాడతారని చెప్పడంతో మధుసూదన్‌ ప్రసాద్‌ సీఐ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులు ఆయనను నిర్బంధించి తమ వాహనంలోకి బలవంతంగా ఎక్కించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, మధుసూదన్‌ ప్రసాద్‌కు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో ఈ విషయాన్ని గమనించిన ఆయన వర్గానికి చెందిన వ్యక్తి అక్రమ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో మధుసూదన్‌ ప్రసాద్‌ పోలీసుల నుంచి విడిపించుకుని ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆయన వర్గానికి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున 3 గంటల వరకు బాపట్ల టౌన్‌ సీఐ రాంబాబుతో కలిసి సుమారు 20 మంది పోలీసులు ఆయన ఇంటి వద్దే ఉండటంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. అనంతరం మధుసూదన్‌ ప్రసాద్‌ తల్లితో మాట్లాడిన పోలీసులు, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా మధుసూదన్‌ ప్రసాద్‌ వ్యవహరించాలని హెచ్చరించి వెనుదిరిగారు. దాడి చేసిన మైనేని మురళీకృష్ణపై చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలే మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement