తెనాలిఅర్బన్: నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర బృందం గురువారం తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించింది. ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రోగ్రాంమేనేజర్, వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి.గీతా పద్మజ, స్టేట్ రాష్ట్ర క్వాలిటీ కన్సల్‌టెంట్ జ్యోతి, డాక్టర్ స్టేఫీ గ్రేస్‌లు జిల్లా వైద్యశాలలోని ఎస్‌ఎంసీయూ, డైక్, ఎన్‌సీడీ, నేషనల్ మెంటల్‌హెల్త్ ప్రోగ్రాం, డయాలసిస్ విభాగాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్‌ను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అన్నపూర్ణ, డీపీఎంవో డాక్టర్ సుజాత, డీపీవో డాక్టర్ సైమన్, ఆర్‌ఎంవోలు డాక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ మంజూష, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేట: ప్రత్యేక బృందాలను రప్పించి విద్యుత్ పునరుద్ధరణకు మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. తుపాను నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, తీగలు తెగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక విద్యుత్ అధికారులతో కలసి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులను సీఎండీ పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఎక్కువగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, చెట్లు పడి విద్యుత్ తీగలు తెగిపోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సమస్య ఉన్న అన్ని ప్రాంతాలలో ప్రత్యేక బృందాలను పిలిపించి మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేటలో 200 మంది సిబ్బందితో మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రికి వీలైనంత మేరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. సరఫర పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్‌ఈ డి.సుధాకర్, ఈఈ వై.ఏడుకొండలు, ఏడీఈ టి.భార్గవి, ఏఈ పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజులుగా రాకపోకలు బంద్
నరసరావుపేటరూరల్: మురసు తుఫాన్ సృష్టించిన బీభత్సానికి కోటప్పకొండ దేవస్థానం ఘాట్‌రోడ్డులో రాకపోకలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. ఘాట్‌రోడ్డులో పలుచోట్ల భారీ వృక్షాలతోపాటు కొండరాళ్లు విరిగిపడ్డాయి. వృక్షాలను, కొండరాళ్ల తొలగించే పనులను అధికారులు చేపట్టారు. భారీ వర్షం కారణంగా పలుచోట్ల ఘాట్ రోడ్డు భారీ కోతకు గురైంది. మలుపుల వద్ద ప్రమాదకరంగా మారడంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గురువారం ద్విచక్రవాహనదారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొండపైన ఆలయ ప్రాంగణంలో భారీ వృక్షాలు సైతం పెను ఈదురుగాలుల ధాటికి నేలకొరిగాయి. భక్తుల సౌకర్యార్ధం దివీస్ ల్యాబ్ సంస్థ అందించిన మినరల్ వాటర్ ప్లాంట్ సైతం ధ్వంసం అయింది. మహా నందీశ్వరుడి వద్ద అభిషేకాలకు ఉపయోగించే స్టీల్ స్టాండ్ దాదాపు వంద అడుగుల దూరంకొట్టుకుపోయింది. ఆలయ ప్రాంగణంలోని దుకాణాలు గాలి ధాటికి దెబ్బతిన్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న రేకులు కూడా ఎగిరి పక్కన పడ్డాయి.


