ప్రచార ఆర్భాటానికి ప్రజాధనమా? | - | Sakshi
Sakshi News home page

ప్రచార ఆర్భాటానికి ప్రజాధనమా?

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

ప్రచార ఆర్భాటానికి ప్రజాధనమా?

ఇన్‌ఫ్లూయెన్సర్ల సేవలకు టీడీపీ ప్రభుత్వం పచ్చజెండా ఇచ్చిన హామీల అమలుకు మాత్రం నిధులు లేవంటూ సాగదీత సర్కారు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

చీరాల: కూటమి నేతలు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘‘అన్నీ చేయాలని ఉంది... కానీ ఖజానా చూస్తే ఖాళీ’’ అంటూ బీద పలుకులు పలికారు. అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. కానీ ఇప్పుడు ఇన్‌ఫ్లూయన్సర్లకు మాత్రం ప్రత్యేకంగా నగదు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇదేం నిర్ణయం?

చంద్రబాబు పాలనలో హామీలు నెరవేర్చలేదని ఎరవైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులతో భయపెడుతున్నారు. ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు చేశారని సోషల్‌ మీడియాలో పోస్టు చేసినా కేసులు పెట్టి వేధించిన దాఖలాలున్నాయి. మరోవైపు ప్రకృతి వనరులైన ఇసుకను కళ్లముందే తవ్వి తరలిస్తున్నా ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలన, పథకాలకు ప్రచారకర్తలుగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను నియమించుకుని ప్రజాధనాన్ని కుమ్మరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలపడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియాకు ఉన్న క్రేజ్‌ మామూలుగా లేదు. ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటిలో ఎక్కడైనా ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ షేర్‌ అవుతోంది. అటువంటి సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ను టీడీపీ ప్రభుత్వం తన ప్రచారానికి వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

చీరాల వచ్చిన సమయంలో..

కొద్ది నెలల క్రితం జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా జిల్లాలోని పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశమై మాట్లాడారు. అలానే పచ్చపార్టీ సానుభూతిపరులైన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం పాలసీకి ఆమోదం తెలిపి విధివిధానాలను వెలువరించింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే ప్రచార ఆర్భాటాలు చేస్తున్నా, అవి సరిపోనట్లుగా ఇన్‌ఫ్లూయెన్సర్ల సేవలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. పేరుకే ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ విధానం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పాలనపై మరింత విస్తృత ప్రచారం చేయించుకునేందుకే ఈ పాలసీని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిని ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ఎంప్యానెల్‌ చేయనున్నారు. ఈ విధానంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఎక్కువ ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లూయెన్సర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి, ఒక్కో వీడియోకు కొంత మొత్తం చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. ఇన్‌ఫ్లూయెన్సర్లలో ఎక్కువ మంది టీడీపీకి సానుభూతిపరులు ఉన్నారని సమాచారం. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం అవసరమే అయినా, అందుకోసం ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేస్తారా అని ప్రజా సంఘాలు, నిరుద్యోగ యువత, మహిళలు భగ్గుమంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తే లబ్ధిదారులే ప్రచారకర్తలుగా మారుతారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల సొమ్ముతోనే ప్రచారం చేయించుకోవడంపై విమర్శలకు తావిస్తోంది.

ఇచ్చిన హామీల సంగతేంటి..?

ప్రభుత్వ పథకాలు, పాలనపై సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను వినియోగించుకునేందుకు కొత్త పాలసీని రూపొందించిన కూటమి ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సంగతేమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంత వరకు నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతిని చెల్లిస్తామన్నారు. అలానే 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తామని చెప్పారు. హామీలను అమలు చేయకుండానే.. అన్నీ అమలు చేశామని ప్రజలను మోసం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement