రాష్ట్రంలో ఉత్తమ బీచ్‌గా సూర్యలంక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఉత్తమ బీచ్‌గా సూర్యలంక

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

రాష్ట్రంలో ఉత్తమ బీచ్‌గా సూర్యలంక

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: రాష్ట్రంలో ఉత్తమ బీచ్‌గా సూర్యలంక గుర్తింపు పొందిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. హరిత రిసార్ట్‌ ఎదుట సూర్యలంక బీచ్‌లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సతీసమేతంగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వినూత్నమైన కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు, పర్యాటకులకు, బాపట్ల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సూర్యలంక బీచ్‌ని రాష్ట్రంలోనే ఉత్తమ బీచ్‌గా ప్రకటించినట్లు చెప్పారు. ఈ ప్రకటన చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ గుర్తింపు రావడానికి సహకరించిన అధికారులు, పురప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

భద్రతకు పెద్దపీట

బీచ్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మైరెన్‌ పోలీసులు, బీచ్‌ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పర్యాటకులు, స్థానికులు బీచ్‌ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటకాల ప్రదర్శనను కలెక్టర్‌ సతీసమేతంగా సందర్శించి వాటిని రుచి చూశారు. విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలను ఆయన వీక్షించారు. వంటకాల ప్రదర్శన, నృత్య (శాసీ్త్రయ, జానపద), క్రీడలు (బీచ్‌ వాలీబాల్‌, కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌), పర్యాటకంపై చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు కలెక్టర్‌ బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అక్టోబర్‌ 10వ తేదీన హరిత రిసార్టులో యువ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించే జామింగ్‌, డీజే సంగీత రాత్రి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్‌, బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్‌ అధికారులు హరి కుమార్‌, నరసింహారావు, వివిధ శాఖల జిల్లా ఉన్నత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement