ఆధ్యాత్మిక అనుభూతి పొందడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక అనుభూతి పొందడమే లక్ష్యం

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

ఆధ్యాత్మిక అనుభూతి పొందడమే లక్ష్యం

దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌

పెదకాకాని: ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందడమే దేవదాయశాఖ లక్ష్యమని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ పేర్కొన్నారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని ఆదివారం సందర్శించారు. అనంతరం కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, భక్తులకు కల్పించే సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రీనరీ, వైదిక కార్యక్రమాలు నిర్వహించడంపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. దేవాలయాల్లో స్వచ్ఛంద సంస్థల సేవకులను వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. వలంటీర్ల సేవలను ఆన్‌లైన్‌ నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నామని, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది స్వచ్ఛంద సేవకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆ సంఖ్యను భవిష్యత్‌లో మరింతగా పెంచి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆలయంలో మౌలిక సదుపాయాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేపడతామని చెప్పారు. పెదకాకాని శివాలయంలో ప్రతి రోజూ 500 మందికి, శని, ఆదివారాల్లో 1000 మందికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి..

భక్తులు ఆలయంలోకి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లే వరకూ ఆలయ ఉద్యోగులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని కమిషనర్‌ రామచంద్రమోహన్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు పట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తొందని అందులో భాగంగానే పెదకాకాని శివాలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపం, యాగశాల, రాహుకేతుల పూజ మండపం, కేశఖండనశాల, భక్తులకు ఇచ్చే వసతి గదులు, అన్నప్రసాదశాల, ప్రసాదాల తయారీ, సరుకుల నిల్వ చేసే గది, సరుకులు, పొంగలి షెడ్డు, నూతనంగా గదుల నిర్మాణానికి గుర్తించిన ప్రదేశంతో పాటు ఆలయంలోని అన్ని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, పాలకవర్గం చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు, స్వామివారి చిత్రం పటం బహూరించారు. కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, ఆలయ పాలకమండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు, పాలకవర్గ సభ్యులు ధూపాటి శివశంకర్‌, కొమ్మూరి మల్లికార్జునరావు, ఎక్స్‌అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement