14 కిలోల రాగి, 350 మీటర్ల అల్యూమినియం వైర్లు స్వాధీనం
భట్టిప్రోలు: భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, కొల్లిపర, తెనాలి మండల పరిధిలోని పొలాల్లో రాగి, అల్యూమినియం వైర్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్, వేమూరు సీఐ నఫీజ్ బాషాలు అరెస్టు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదు కేసు వివరాలు పరుచూరి రమేష్(ఓలేరు), పెదపులివర్రు గ్రామానికి చెందిన కొంత మంది కలసి 17, 18 తేదీల్లో పొలాలలో కరెంటు మోటార్లలోని రాగి వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేమూరు సర్కిల్ పరిధిలోని గ్రామాలలో జరిగిన కరెంటు వైర్లు దొంగతనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, డీఎస్పీ అజీజ్ సూచనల మేరకు సీఐ బాషా, భట్టిప్రోలు ఎస్‌ఐ కె. అమీర్ వారి సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులు ఆవుల కోటయ్య అలియాస్ కోటిగాడు (వెల్లటూరు), కొమరగిరి వీరాంజనేయులు (వెల్లటూరు), ఆవుల ఏసు (వెల్లటూరు), ఆవుల ఏసు అలియాస్ జంకడు (వెల్లటూరు), ఆవుల ఏసుబాబు అలియాస్ మొద్దోడు (వెల్లటూరు), ఆవుల ఏసు (అవనిగడ్డ), ఆవుల సాంబయ్య (వెల్లటూరు), శీలం మహేష్(వెల్లటూరు), తుపాకుల ఇస్తాకు (వెల్లటూరు), బాపట్ల రాజేష్ (వెల్లటూరు), కుందేటి నాగవెంకట గోపి (భట్టిప్రోలు) వీరిని ఆదివారం ఎస్‌ఐ అమీర్ వెల్లటూరు చినరేవు బిడ్జ్రి వద్ద అరెస్టు చేశారు. వీరి నుంచి 14 కిలోల రాగి వైరు, 350 మీటర్ల అల్యూమినియం కరెంటు వైర్లు దొంగతనాలకు ఉపయోగించిన రెండు మోటారు సైకిళ్లు, కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి దొంగలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించారు.


