ఏడుగురి పేర్లతో రిజిస్ట్రేషన్?
అది మున్సిపల్ ఆస్తే
● ఏకంగా 27 సెంట్ల
మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్
● ఆక్రమిత భూమి విలువల
దాదాపు రూ.పది కోట్లపైనే
● ఏఎంజీకి అప్పగించిన స్థలం
ఏడుగురి పేరిట రిజిస్ట్రేషన్
యడ్లపాడు: చిలకలూరిపేట పురపాలక సంఘానికి ఆనుకుని ఉన్న పరిధిలోని ప్రజాప్రయోజనాల కోసం నిర్దేశించిన రిజర్వ్‌డ్ స్థలం అది. కార్మికుల కుటుంబాల పిల్లల విద్య, మధ్యాహ్న భోజనం కోసం ఏఎంజీ స్వచ్ఛంద సంస్థకు అధికారులు అప్పగించారు. కొంతకాలం డే–కేర్ సెంటర్‌గా కొనసాగిన రూ. పది కోట్ల విలువైన ఆ భూమి ఇప్పుడు యాజమాన్య హక్కుల వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న ఈ స్థలం ఏడుగురు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ అయినట్లు పత్రాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలదే ఇందులో కీలక పాత్రగా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఏంఎజీకి అప్పగించిన ఈ భూమిలోని భవనాన్ని తొలగించి స్థలాన్ని చదును చేయడంతో విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సెప్టెంబర్ 4న అధికారికంగా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి, స్థలం రక్షణ గేటుకు తాళంతో పాటు మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ స్థలాన్ని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఆస్తిగా అధికారులు స్పష్టం చేస్తున్న భూమికి ప్రైవేటు హక్కులు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు రాజకీయ కోణం కూడా తోడవుతోంది. అయితే ఈ స్థలం వాస్తవంగా ఎవరిది? మున్సిపల్ ఆస్తి అయితే ప్రైవేటు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఒకవేళ స్వచ్ఛంద సంస్థకు గుత్తాధిపత్యం ఉంటే మున్సిపల్ అధికారులు సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ఈ ఆస్తి వివాదంలో చిక్కుకోవడంపై బాధ్యులెవరనే విషయంపైనే ఇప్పుడు ప్రజల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఏఎంజీకి స్థలం అప్పగింత ఇలా...
హెచ్‌హెచ్ డైక్‌మెన్ నగర్ నివాసితుల కమ్యూనిటీ అవసరాల కోసం ఉద్దేశించిన ఈ రిజర్వ్‌డ్ స్థలాన్ని 1998లో పురపాలకశాఖ ఏఎంజీ సంస్థకు అప్పగించింది. పారిశుధ్య కార్మికుల పిల్లలకు విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్కడ డే–కేర్ సెంటర్ నిర్వహించారు. ఏఎంజీ ప్రధాన దాత జర్మనీకి చెందిన డాక్టర్ హెచ్‌హెచ్ డైక్‌మెన్ మరణం తర్వాత ఆ కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మున్సిపాలిటీ ఆ స్థలాన్ని ఏ ప్రాతిపదికన ఏఎంజీకి అప్పగించింది? లీజా.. వినియోగానికి అనుమతా.. లేక ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారమా? అనే వివరాలను నిర్ధారించే పాత రికార్డులేవీ దొరకలేదని, వాటి కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. డోర్ నంబర్ 80/1, సర్వే నంబర్ 138/1గా పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టు 11న స్థలం ఏడుగురి పేర్లతో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పన్ను అసెస్‌మెంట్ నంబర్ 1020025573 కూడా పత్రాల్లో ఉన్నట్లు సమాచారం. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు అందించిన సేవలకు ప్రతిఫలంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్ కంటి మహంతి తరఫున వారికి స్థలాన్ని కానుకగా ఇచ్చినట్లు దస్తావేజుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, రిజిస్ట్రేషన్ సమయంలో అక్కడ డే–కేర్ భవనం ఉన్నప్పటికీ ఖాళీ స్థలంగా చూపించినట్లు సమాచారం. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న భూమి విషయంలోనే యాజమాన్య హక్కులపై ఇంతటి వివాదం తలెత్తడం ఇప్పుడు అధికారుల పాత్రపైనా అనుమానాలకు తావిస్తోంది.
మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును దీనిపై ‘సాక్షి’ వివరణ కోరగా.. వివాదాస్పద స్థలం సర్వే నంబర్ 88లోని 27 సెంట్లు మున్సిపల్ ఆస్తిగా స్పష్టం చేశారు. పన్ను అసెస్‌మెంట్ ఇటీవలే ఇచ్చారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. గతం నుంచే అసెస్‌మెంట్ నంబర్ ఉందన్నారు. సదరు స్థలం ఏఎంజీకి ఏ ప్రాతిపదికన అప్పట్లో ఇచ్చారనే విషయంపై రికార్డులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. తమ స్థలంలోని భవనం తొలగించారని తెలిసి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు ఎలా రిజిస్ట్రేషన్లు చేసుకున్నా అది పక్కా మున్సిపల్ ఆస్తి అని, ఆ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని పేర్కొన్నారు. వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కూ లభించదని తేల్చి చెప్పారు.


