● లారీని ఢీకొన్న కారు
● మంటలు చెలరేగి కారు దగ్ధం
● ప్రయాణికులు సురక్షితం
పిడుగురాళ్ల: ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేట వైపు నుంచి కారంపూడి వైపునకు ఓ లారీ వెళుతోంది. ఇంతలో కారంపూడి వైపు నుంచి గుత్తికొండ వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొంది. గుత్తికొండ గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న నలుగురు వ్యక్తులను క్షేమంగా కాపాడారు. అదృష్టశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


