గ్రామీణ బ్యాంకుల బలోపేతానికి ఐక్య పోరాటం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం ఏఐబీఈఏ అధ్యక్షుడు రాంబాబు
కొరిటెపాడు(గుంటూరు): గ్రామీణ బ్యాంకుల బలోపేతానికి ఐక్య పోరాటం నిర్వహించనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) అధ్యక్షుడు బీఎస్ రాంబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అనుబంధ సంస్థగా ఏర్పడిన అనంతరం తొలి జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజ్‌మెంట్లతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందన లేకుంటే అక్టోబర్ 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అన్ని పోరాటాలకు ఏఐబీఈఏ సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్పొరేట్ రుణాల ఎగవేతపై ఆందోళన..
కొన్ని కార్పొరేట్ సంస్థలు తీసుకున్న భారీ రుణాలను ఎగవేయడం వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభనష్టాల ఒడిదుడుకులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న సంస్థలకు తక్కువ మొత్తానికి సెటిల్‌మెంట్లు చేయడం వలన బ్యాంకులపై ఆర్థిక భారం పడుతోందని వెల్లడించారు.
ప్రైవేటీకరణను అడ్డుకుంటాం..
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రయత్నాలను బ్యాంకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారు. సమావేశంలో మూర్తి, రాధాకృష్ణమూర్తి, నాగపావని, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, వెంకటేష్ తదితర నాయకులు ప్రసంగించారు.
నూతన కార్యవర్గం..
అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా చైర్మన్‌గా పీవీ రాఘవరావు, అధ్యక్షుడుగా టి.హరనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.షణ్ముఖరావు, కోశాధికారిగా ఎం.నరహరి ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, గ్రామీణ బ్యాంకుల బలోపేతం లక్ష్యంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది.


