చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యే | - | Sakshi
Sakshi News home page

చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యే

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్‌ గోపి మృతి ఘటనపై గుంటూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం

లక్ష్మీపురం: చీకటి గోపిది ముమ్మాటికి పోలీసుల హత్యేనని, బాధ్యులపై చర్య తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులతో కలిసి పోలీసులపై చర్య తీసుకోవాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ పోలీసుల చర్యల వలనే గోపి మృతి చెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న ఘటనలో అదే పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారణ చేయడం వల్ల విచారణ నిష్పక్షపాతంపై అనుమానాలు ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చీకటి గోపి ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో గత కొంతకాలంగా పోలీసుల కస్టడీ, విచారణ లేదా పోలీసుల చర్యల అనంతరం వ్యక్తులు మృతి చెందిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఇది ఒక్క గోపి కుటుంబం సమస్య కాదని, చీకటి గోపి మరణాన్ని ఒక కుటుంబానికి జరిగిన విషాదంగా మాత్రమే చూడకూడదన్నారు. పోలీసు స్టేషన్‌కు విచారణ కోసం పిలిపించిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హింస, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేస్తూ పోలీసుల దుర్మార్గంపై, సీఐడీ ఎస్పీ చెప్పే అబద్ధాలపై జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలను ప్రత్యేకంగా కలిసి సమస్య తీవ్రతను వివరించాలని, డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమస్య పరిష్కారం కాకపోతే చలో గుంటూరు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement