‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి

రైతులను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కారు ప్రజాసమస్యలు వదిలిపెట్టి సొంత వ్యాపారాలకే మంత్రులు పరిమితం డీఎస్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలు శాసనమండలి ఉపసభాపతి తూమాటి మాధవరావు

అవినీతిపై సర్కారును గట్టిగా నిలదీద్దాం

బాపట్ల: వైఎస్సార్‌ సీపీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్‌ కల్పించేందుకు అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని శాసనమండలి ఉపసభాపతి తూమాటి మాధవరావు పేర్కొన్నారు. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బాపట్లలోని సూర్యకాళి ఫంక్షన్‌ హాలులో జిల్లా పార్టీ సమావేశం, గుర్తింపు కార్డుల పంపిణీ శనివారం జరిగింది. ఈ సమావేశంలో తూమాటి మాధవరావు మాట్లాడుతూ కూటమి సర్కారుపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని తెలిపారు. పొగాకు రైతులు ఇటీవల మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కన్నీటి పర్యంతమయ్యారని గుర్తు చేశారు. రైతే రాజుగా సాగిన జగనన్న పాలన చూసిన వారు టీడీపీ ప్రభుత్వంలో మరోసారి మోసపోయామని చెప్పారన్నారు. బాపట్ల జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే, ఒకరు 22ఏ ఉన్న భూములకు విముక్తి కల్పించలేకపోగా, మరో మంత్రి రెండుగంటలు విద్యుత్‌ కోతలు అంటూ తన వైఫల్యాన్ని ప్రకటించుకుంటున్నారని పేర్కొన్నారు. సొంత వ్యాపారాలపై చూపుతున్న శ్రద్ధను ప్రజల సమస్యలపై వారు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరికీ గుర్తింపు

పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ... పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. పార్టీలో ప్రతి సభ్యునికి గుర్తింపు ఇస్తూ కార్డులు ఇవ్వడం స్వాగతించదగిన విషయంగా ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బలమైన నాయకులను గెలిపించుకునే వరకు అందరిపై బాధ్యత ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలు వివరించాలి

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఏవిధంగా కుంటుపడిందో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఓటు హక్కు విలువైనదని, దానిని కాపాడుకోవాలని తెలిపారు. ఓటుకు సంబంధించిన నోటీసు ఇస్తే దానికి తగిన సమాధానం చెప్పాలని సూచించారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై గట్టిగా నిలదీద్దామని అన్నారు. కూటమి అక్రమాలను గట్టిగా ప్రతిఘటిద్దామని చెప్పారు. ఎదురు తిరిగిన వారిపై టీడీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని, వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి తిరిగి ఏవిధంగా సమాధానం చెప్పాలో తెలుసునన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, చీరాల, పర్చూరు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్తలు కరణం వెంకటేష్‌ బాబు, గాదె మధుసూదన రెడ్డి, వరికూటి అశోక్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, యల్లావుల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement