● రెండు రోజుల్లో 40 కి.మీ. పూర్తిచేసిన పీటా నాగమోహన్‌కృష్ణ, పార్టీ శ్రేణులు ● మూడు మండలాల్లోని 15 గ్రామాల్లో అన్నదాతల సమస్యలపై ఆరా
రేపల్లె: రైతు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన వైఎస్సార్ రైతు భరోసా పాదయాత్ర శనివారం రాత్రి చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెంతో ముగిసింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, రైతు రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ నిజాంపట్నం మండలం అడవులదీవి నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. మొదటి రోజు ఎనిమిది గ్రామాల మీదుగా సుమారు 20 కిలోమీటర్లు యాత్ర సాగింది. నగరం మండలం చిన్నమట్లపూడిలో ముగిసింది. రెండో రోజు పాదయాత్ర పెదగొల్లపాలెం, పరిశావారిపాలెం, సిరిపూడిల మీదుగా చెరుకుపల్లి మండలంలోని బలుసులపాలెం, మెట్టగౌడపాలెం చేరుకుంది. తర్వాత తుమ్మలపాలెం వరకు కొనసాగింది. ఈ రెండు రోజులలో మొత్తం 15 గ్రామాల్లో సుమారు 40 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యింది. మోహన్‌కృష్ణ రైతుల పొలాలను సందర్శించి, వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైతుల వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. గుర్తించిన సమస్యలను నివేదికగా తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. పరిష్కారం కోసం కోరతామని, లేదంటే పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. రెండవ రోజు పాదయాత్రలో పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి పాదయాత్రలో పాల్గొని నాగమోహన్‌కృష్ణకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


