రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్‌లో పతకాల పంట బాపట్లటౌన్: పట్టుదలతో పోరాడి రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో పతకాలు సాధించడం హర్షణీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. పతకాలు సాధించిన సిబ్బందిని శనివారం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో గుంటూరు రేంజ్ తరఫున పాల్గొన్న బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బంది 9 స్వర్ణ, 17 రజత, 10 కాంస్య పతకాల చొప్పున మొత్తం 36 పతకాలు సాధించడం హర్షణీయమన్నారు. బాపట్ల టౌన్ సీఐ ఆర్.రాంబాబు లాన్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో ట్రోఫీ గెలుచుకుని స్వర్ణ పతకం సాధించారు. ఏఆర్ కానిస్టేబుళ్లు జి.వి.ఎస్.నాగకుమార్, ఎం.గోపి డాగ్ స్క్వాడ్ ట్రాకర్ పోటీల్లో రజత పతకం, చీరాల 1 టౌన్ మహిళా కానిస్టేబుల్ జి.సునీత ఒక స్వర్ణ, రెండు రజత, మూడు కాంస్య పతకాలు, చీరాల–2 టౌన్ మహిళా కానిస్టేబుల్ సి.హెచ్. సునీత రెండు స్వర్ణ, ఒక రజత పతకం, వెదుళ్లపల్లి మహిళా కానిస్టేబుల్ నాగవాణి మూడు రజత, రెండు కాంస్య పతకాలు, జిల్లా పీజీఆర్‌ఎస్ సెల్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ పి.నాగబ్రహ్మారెడ్డి ఈత పోటీల్లో 7 పతకాలు, కర్లపాలెం కానిస్టేబుల్ వి.నరేంద్ర 5 పతకాలు, ఏఆర్ కానిస్టేబుల్ ఎం.నరేష్‌బాబు రెండు పతకాలు, ఏఆర్ కానిస్టేబుల్ వి.శివశంకర్ హ్యాండ్‌బాల్ పోటీల్లో కాంస్య పతకం, వేటపాలెం కానిస్టేబుళ్లు ఎం.వెంకటరెడ్డి, ఎన్.వి.సుబ్బారెడ్డి, ఏఆర్ కానిస్టేబుల్ బి.నాగఆంజనేయులు కబడ్డీలో రజత పతకాలు, జిల్లా పీజీఆర్‌ఎస్ సెల్‌లో విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్ ఎన్.స్వరూప కబడ్డీలో రజత పతకాలు సాధించారు. క్రీడల్లో పాల్గొని జిల్లాకు మెడల్స్ సాధించిన క్రీడాకారులకు జిల్లా తరఫున ప్రత్యేక రివార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు.
● పోలీస్ శాఖ విధులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయని, క్రీడల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ధృడత్వాన్ని అందిస్తాయన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహిస్తామన్నారు. జిల్లా పోలీస్ జాగిలాల సామర్థ్యాన్ని షాడో జాగిలం మరోసారి నిరూపించిందన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన జాగిలాల క్రీడా పోటీల్లో ట్రోఫీ సాధించిందని, అందుకుగాను రజత పతకం గెలుచుకోవడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మోలుద్దిన్, ఇతర పోలీస్ అధికారులు, మెడల్స్ సాధించిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
● 36 పతకాలు సాధించిన
జిల్లా పోలీసులు
● జాగిలాల పోటీల్లో సత్తాచాటిన
షాడో జాగిలం
● మెడల్స్ సాధించిన సిబ్బందిని
అభినందించిన జిల్లా ఎస్పీ
సత్తాచాటిన పోలీస్ జాగిలం షోడోను అభినందిస్తున్న జిల్లా ఎస్పీ
అవార్డులు సాధించిన సిబ్బందిని అభినందిస్తున్న జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్