జీజీహెచ్‌లో నానాటికీ పెరుగుతున్న మరణాల రేటు నెలకు సగటున 550 మంది వరకు మృత్యువాత వైద్యులు, అధికారుల నిర్లక్ష్యానికి రోగులు బలి అత్యవసర వార్డుల్లో అందుబాటులో ఉండని వైద్య నిపుణులు జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో సేవలు
సొంత పనులే ముఖ్యం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వెంటిలేటర్‌పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే శ్మశానం వద్ద కదలాడినట్లు గమనించి కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణి అక్కడ వైద్యులు లేక గంటలకొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించిన హృదయ విదారకమైన ఘటన.. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించిన దారుణం.. బతికుండగానే స్ట్రెచర్ సహా ఓ వృద్ధుడిని బయటకు గెంటేసిన వైనం.. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా రోగికి ఇంజెక్షన్ ఇవ్వని ఘటన.. ఇవన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జీజీహెచ్‌లో జరిగిన ఘటనలు. మళ్లీ చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ నిర్లక్ష్యం మరింత పెరిగింది.
అత్యవసర వేళ వెటకారం
తాజాగా ఈ నెల ఒకటో తేదీన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి(30) తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగంలో చేరాడు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నాడంటూ బంధువులు ఎంత వేడుకున్నా అక్కడి వైద్య సిబ్బంది చలించలేదు. పైగా ‘ఎవరి ఆక్సిజన్ మాస్క్ అయినా పీక్కుని వచ్చి మాకు ఇవ్వండి.. పెడతామంటూ’ వెటకారంగా మాట్లాడారు. కొద్ది సేపటికే ఊపిరి అందక గోపి మృతి చెందాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇలాంటి దారుణ ఘటనలు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో కోకొల్లలు.
ఎంతో కీలక ఆసుపత్రి
జీజీహెచ్‌కు గుంటూరుతో పాటు చుట్టుపక్కలనున్న ఆరు జిల్లాల ప్రజలు వైద్యం కోసం వస్తారు. రోజుకు దాదాపు 3,500 నుంచి 4 వేల మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యులు, వారు అందజేస్తున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షాత్తు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ వారంలో రెండు రోజులు సెలవులు పెట్టి మరీ హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు పరుగులు పెడుతున్నారు. సీఎస్‌ఆర్‌ఎం వెంకటేశ్వరరావు సైతం రాత్రివేళ అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న ఇద్దరు అధికారులు సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో మిగతా వారు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
జీజీహెచ్‌లో గత తొమ్మిది నెలలుగా నమోదవుతున్న మరణాల రేటును పరిశీలిస్తే.. గుండెలు పగిలే నిజాలు వెలుగులోకొచ్చాయి. జీజీహెచ్‌లో 2024లో 7,846 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. 2025లో 6,529 మంది చనిపోయారు. 2026లో సైతం వారానికి వంద మంది చొప్పున మృత్యువాత పడుతున్న దయనీయ పరిస్థితి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి.
తీరు మార్చుకోని అఽధికారులు
ఆస్పత్రిలో అత్యవసర వైద్యచికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీఎస్‌ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్‌లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని వైఎస్సార్ సీపీ హయాంలో నూతనంగా ప్రారంభించారు. అయితే ఎమెర్జెన్సీ వైద్యులు సరిగా డ్యూటీలు చేయకుండా సొంత ప్రాక్టీసు చేసుకుంటూ ఈ విభాగాన్ని గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసర వార్డుల్లోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఇంత జరుగుతున్నా వైద్యులు మాత్రం తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టును సీనియర్‌లకు ఇవ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారికి ఇవ్వడంతో సీనియర్ వైద్యులెవరూ వారి మాట లెక్కచేయని పరిస్థితి. ఇన్‌చార్జులు కావడంతో వారు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్‌గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్‌లో మరణాల సంఖ్య తగ్గడం లేదు.
అధికారికంగా 1,250 ... అనధికారికంగా మరో వెయ్యికిపైగా పడకలతో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా ఉంది. ఫలితంగా, ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్‌లకు కేటాయిస్తున్న సమయం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఇవ్వడం లేదు. ప్రధానంగా క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమెర్జెన్సీ వార్డులు, గైనిక్, పిల్లల వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.


