నాట్లు వేసేందుకు భగీరథ యత్నాలు కరుణించని వరుణుడు.. భగ్గుమంటున్న భానుడు రోజంతా తడిపినా ఎకరం కూడా పూర్తవని వైనం
పెరిగిన పెట్టుబడి భారం
ఏటా ఈ సీజన్‌లో పొలాలను దమ్ముచేసి నాట్లు వేసుకునే పనిలో నిమగ్నమయ్యే అన్నదాతలు ఈ ఏడాది డీజిల్ ఇంజిన్లు ఉన్న వ్యక్తుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి ఏడాది పొలం ఈనే తరుణంలో, గింజ పాలు పోసుకునే దశలో నీటి ఎద్దడి ఏర్పడేది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలకు ఆదిలోనే అగచాట్లు ప్రారంభమయ్యాయి. కాలువలకు సాగునీరు రాకపోవడంతో పొలాలను తడిపేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బాపట్ల: ప్రతి ఏడాది జూన్, జూలై మాసంలోనే నాట్లు వేసుకునే అన్నదాతలు ఈ ఏడాది సెప్టెంబర్ మాసం వచ్చినప్పటికీ కాలువలకు చుక్కనీరు రాకపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. ఏటా జూలై ముగిసేంతవరకు వర్షపాతం సరిపడా నమోదై ఉండేది. అలాంటిది సెప్టెంబర్ వచ్చినా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు భగీరథ యత్నాలు చేస్తున్నారు. మండలంలోని న్యూ ముత్తాయపాలెం చానల్, పడమర బాపట్ల చానల్, పీటీ చానల్ పరిధిలోని పిన్నిబోయినవారిపాలెం బ్రాంచ్ కాలువలకు సాగునీరు విడుదల కాలేదు. దీంతో ఆ పరిధిలోని పిన్నిబోయినవారిపాలెం, వల్లువారిపాలెం, మచ్చావారిపాలెం, చింతావారిపాలెం, ముత్తాయపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, మద్దిబోయినవారి పాలెం, కొత్తమద్దిబోయినవారిపాలెం గ్రామాల్లోని రైతులు పొలాలను బీడులుగా వదిలిపెట్టడం ఇష్టంలేక డీజిల్ ఇంజిన్లను ఆశ్రయించి పొలాలను తడిపి నాట్లు వేస్తున్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజంతా కష్టపడినా ఎకరం పొలం కూడా తడవడం లేదు. రోజుకు ఇంజిన్‌కు రూ. వెయ్యి, డీజిల్‌కు రూ.500, పైపుల అద్దెకు రూ. 500 చొప్పున ఎకరం తడిపేందుకు అదనంగా రూ. 2,000 భరించాల్సి వస్తోంది. నాటుకు ఎకరాకు రూ. వెయ్యి చొప్పున కూలీలు పెంచారు. ఆయా గ్రామాల్లోని రైతులు సుమారు 50 ఎకరాలు బీడు భూములుగా వదిలేశారు.
నగరం: పంట కాలువలో ఆశించిన స్థాయిలో సాగునీరు లేకపోవడంతో పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండటంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రత్యేకంగా బోర్లను సైతం వేస్తున్నారు. ఒక్కో బోరు, విద్యుత్ మోటార్లు, ట్యూబులకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేసి నీటిని పెడుతున్నారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. పంట కాలువల్లో ఉన్న అరకొర నీటిని డీజిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లకు ఇంజిన్లు ఏర్పాటు చేసి పైపుల సహాయంతో పెడుతున్నారు. ఇలా ఎకరాకు ఒకసారి నీరు తడిపేందుకు సుమారు రూ.2 వేలకుపైగా ఖర్చు చేస్తున్నారు.


