రిమాండ్‌ ఖైదీకి సకల సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీకి సకల సౌకర్యాలు

Sep 5 2026 5:31 AM | Updated on Sep 5 2026 5:31 AM

టీడీపీ నేతకు ప్రత్యేక వసతుల కల్పనపై ఆరోపణలు పోలీస్‌స్టేషన్‌పై దాడి, సీఐని దూషించిన కేసులో నిందితుడు ఆస్పత్రి వార్డులో రిసార్ట్స్‌ వసతులు ఆరోగ్యవంతుడని సర్టిఫై చేశాకే కోర్టుకు హాజరు చర్మవ్యాధికి చికిత్స పేరుతో నిబంధనల ఉల్లంఘన

సాక్షి ప్రతినిధి నెల్లూరు: అధికారం మత్తులో టీడీపీ నేత ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే దాడికి తెగబడి.. అడ్డుకున్న సీఐను కులం పేరుతో దూషించిన కేసులో నిందితుడిని న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనారోగ్యం పేరుతో పెద్దాస్పత్రిలోని వార్డులో రిసార్ట్స్‌ వసతులు కల్పించుకుని, సకల భోగాలు అనుభవిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితుడికి కల్పిస్తున్న వసతులు బయటకు రాకూడదనే ఏకంగా పెద్దాస్పత్రిలోని ఒక వార్డును ఖాళీ చేయించారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సెక్యూరిటీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు ఇలా ఉన్నాయి.. బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన టీడీపీ నేత జి.బాలకోటిరెడ్డి చుండూరు పోలీసుస్టేషన్‌పై దాడి చేసి అక్కడి సీఐను కులం పేరుతో దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గత నెల 23న పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. అరెస్ట్‌, రిమాండ్‌, జైలుకు తరలింపు వరకు నిబంధనల ప్రకారమే జరిగినా.. మూడు రోజులకే 26వ తేదీ నుంచి చర్మ వ్యాధి పేరుతో నెల్లూరు జీజీహెచ్‌లో చేరాడు.

జైల్లోనే చికిత్స అందించాల్సి ఉన్నా..

సాధారణంగా రిమాండ్‌ లేదా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యానికి గురైతే జైల్లో వైద్యుల పర్యవేక్షణలో అక్కడే ప్రత్యేక వార్డులో చికిత్స అందించడం సాధారణ ప్రక్రియ. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో మాత్రమే మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ప్రధానాస్పత్రులకు తరలించి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రిజనర్స్‌ వార్డులో చికిత్స అందించాలి. ఇందుకు భిన్నంగా ప్రత్యేక గది ఏర్పాటు చేసి, ఆయన కోసం ఒక నర్సుకు, ఇద్దరు కానిస్టేబుళ్లకు డ్యూటీలు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరి ప్రత్యేక గది ఎలా?

అయితే సాధారణ చర్మ వ్యాధి పేరుతో జీజీహెచ్‌కు తరలించడంలో జైలు అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. బాలకోటిరెడ్డిని ప్రిజనర్స్‌ వార్డులో కాకుండా ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచారనే ఆరోపణలున్నాయి. సాధారణ ఖైదీలకు ఒక నిబంధన, రాజకీయ పలుకుబడి కలిగిన వారికి మరో నిబంధనా? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి అతనికి ఎలాంటి వ్యాధులు లేవని తెలుస్తోంది. అరెస్ట్‌ చేసినప్పుడే నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరుస్తారు. అయితే రిమాండ్‌కు తరలించిన మూడు రోజుల్లోనే చర్మ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా.. ప్రత్యేక వైద్యం పేరుతో ఆస్పత్రిలో చేరడంపైనే విమర్వలు వినిపిస్తున్నాయి.

న్యాయస్థానం అనుమతి లేకుండానే..

నిబంధనల ప్రకారం ఖైదీని పేరూమ్స్‌ లేదా ప్రత్యేక గదిలో ఉంచాలంటే న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి అవసరమని సంబంధిత న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయితే బాలకోటిరెడ్డికి అలాంటి అనుమతి లేకుండానే ఇలా ప్రత్యేక వైద్యం పేరుతో ప్రత్యేక గదిలో పెట్టి రిసార్ట్స్‌ తరహాలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులు లేకుండా జైలు అధికారులు ఏ అధికారాలతో ప్రత్యేక వసతులు కల్పించారో చెప్పాలని డిమాండ్‌ వినిపిస్తోంది. కోర్టు నుంచి అనుమతులు లేకుండానే తనకున్న రాజకీయ పరపతిని ఉపయోగించుకుని ప్రత్యేక గదిలో ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న ప్రశ్న తలెత్తుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement