గుంటూరు వెస్ట్: అమరావతి చాంపియన్‌షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన గుంటూరు జిల్లా క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పఠాన్ అఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జేసీని కలిసి పతకాలతోపాటు సాధించిన కప్‌ను చూపించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలను తమ లక్ష్యంగా మార్చుకోవచ్చన్నారు. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అప్రోజ్ ఖాన్‌కు ఉత్తమ క్రీడాభివృద్ధి అధికారి అవార్డు లభించడం పట్ల జేసి ప్రత్యేకంగా అభినందించారు. అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ తిరుపతిలో ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన అమరావతి చాంపియన్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు 10 బంగారు పతకాలు, 9 వెండి పతకాలు సాధించారు. బాస్కెట్‌బాల్ అండర్ – 23 పురుషులు, వాలీబాల్ అండర్ – 23 మహిళల విభాగాల్లో ప్రథమ స్థానాన్ని సాధించి విజేతలుగా నిలిచారన్నారన్నారు. డీఆర్‌ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాధ్, క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.


