స్కాలర్‌షిప్‌ పేరుతో సైబర్‌ మోసాలు | - | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ పేరుతో సైబర్‌ మోసాలు

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచన

బాపట్ల టౌన్‌: స్కాలర్‌షిప్‌ పేరుతో జరిగే సైబర్‌ మోసాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం సాంకేతికత ఆధారంగా సైబర్‌ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునే సందర్భాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి, తాము స్కాలర్‌షిప్‌ విభాగం, విద్యాసంస్థ, ప్రభుత్వ శాఖ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకుని, స్కాలర్‌షిప్‌ మంజూరైందని, స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని ఖాతాలో జమ చేయడానికి కొన్ని వివరాలు అవసరమని చెబుతున్నారన్నారు.

ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం/డెబిట్‌ కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. కొంతమంది సైబర్‌ నేరగాళ్లు స్కాలర్‌షిప్‌ దరఖాస్తు, ధ్రువీకరణ పేరుతో అనుమానాస్పద లింకులు పంపి, ఆ లింకులను క్లిక్‌ చేయడం ద్వారా నకిలీ వెబ్‌సైట్‌లకు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలను నమోదు చేయించడం, హానికరమైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించడం, బ్యాంకు సంబంధిత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చన్నారు.

స్కాలర్‌షిప్‌ పొందేందుకు ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాలని, రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో డబ్బులు పంపాలని కోరినా అప్రమత్తంగా ఉండాలన్నారు. స్కాలర్‌షిప్‌కు సంబంధించిన సమాచారం కోసం ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు వారి మాటలను మాత్రమే నమ్మకుండా, సంబంధిత విద్యాసంస్థ, అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌, సంబంధిత శాఖ ద్వారా సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోవాలన్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌, మెసేజ్‌లు, వాట్సాప్‌ సందేశాలు, అనుమానాస్పద లింకుల విషయంలో తొందరపడి స్పందించవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం/డెబిట్‌ కార్డు వివరాలు, పిన్‌, పాస్‌వర్డ్‌, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఫోన్‌ ద్వారా ఎవరైనా అడిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement