బాపట్ల: ఉద్యోగుల సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పి. నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో జేఏసీ తీసుకునే ప్రతి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నామని సూచించారు. ఈ మేరకు మండల, జిల్లా స్థాయిలలో తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా చర్చించామన్నారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం తీసుకోబోయే నిర్ణయంపై పూర్తి స్థాయిలో కార్యాచరణను అమలు చేయటానికి సంసిద్ధంగా ఉండాల్సిందిగా అన్ని మండలాల కార్యవర్గాలను సమాయత్తం చేయాలని ఈ సమావేశం నిర్ణయించిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి ఏపీ జేఏసీ బాపట్ల జిల్లా సెక్రటరీ వినయ్, ఎస్‌టీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ బాపట్ల సిటీ చైర్మన్ జి. ఇస్సాకు, అసోసియేషన్ బాపట్ల జిల్లా కార్యదర్శి బి. ప్రసాదరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ బాపట్ల జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా ఉమెన్ వైస్ చైర్మన్ వెంకటేశ్వరమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.9907 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీ ద్వారా వెళుతోంది.


