పోలీసులపై చర్యలు తీసుకోవాలి
న్యాయం జరిగేంత వరకు పోరాటం
● విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు
వెళ్లి.. అనంతరం జీజీహెచ్‌లో చికిత్స
పొందుతూ మృతిచెందిన గోపి
● మృతుడి కుటుంబ సభ్యులను
పరామర్శించిన వైఎస్సార్ సీపీ నేతలు
● బాధితులకు అండగా
ఉంటామని హామీ
గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి (30) గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందిన వైనంపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి గేటు వద్ద మృతదేహం పెట్టుకుని ఆందోళన చేశారు. గోపి భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాలవజ్రబాబు, వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబులు సందర్శించి నివాళుల ర్పించారు. గోపి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు జ్వరంతో ఉన్న గోపీని వీపుపై, కాళ్లపై బాగా కొట్టారని, జీజీహెచ్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది ఆక్సిజన్ పెట్టాలని బతిమిలాడినా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే గోపి చనిపోయాడని కుటుంబ సభ్యులు వైఎస్సార్‌సీపీ నేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని, పోలీసులపై కేసు నమోదు చేసేవరకు న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
జ్వరంతో ఉన్న గోపిని పోలీసులు భయపెట్టి పోలీసు స్టేషన్‌కు పిలిపించి చోరీతో సంబంధం లేకపోయినా చావగొట్టారు. పోలీసులు కొట్టారనడానికి వంటి మీద గాయాలే సాక్ష్యం. కొట్టిన అనంతరం అనారోగ్యంతో ఉన్న గోపికి చికిత్స చేయించకుండా ఏమీ కొట్టనట్లుగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈసంఘటన చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దళితుడు, చిన్న కుటుంబానికి చెందిన గోపి పట్ల పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. దిక్కులేని వ్యక్తిని చూసినట్లుగా గోపిని పోలీసులు చూడడం చాలా బాధాకరం. చోరీతో సంబంధం లేని వ్యక్తిని చావగొట్టి, నడుము కింది భాగం, కాళ్లు పూర్తిగా పనిచేయకపోయినా పట్టించుకోకుండా ఆసుపత్రిలో చేర్పించకుండా కనీస జాలి, దయ చూపించకుండా కుటుంబ సభ్యులకు వదిలేయడం చాలా బాధాకరం. గోపికి మృతికి కారణమైన పోలీసులను తక్షణమే సస్పెండ్‌చేయాలి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. విజయవాడ లాకప్ డెత్ సంఘటన మరువకముందే మళ్లీ గుంటూరులో పోలీసులు ఇలా ప్రవర్తించడం దారుణం. గోపి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. గోపి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం.
– వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి
గోపిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తీసుకెళ్లి విచారణ చేసి చావగొట్టారు. పార్టీలకతీతంగా గోపికి అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
– వరికూటి అశోక్‌బాబు,
వైఎస్సార్ సీపీ వేమూరు ఇన్‌చార్జి


