రైతు బజార్లలో తగ్గింపు ధరలతో బియ్యం విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

రైతు బజార్లలో తగ్గింపు ధరలతో బియ్యం విక్రయాలు

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

గుంటూరు వెస్ట్‌: జిల్లా రైతు బజార్లలో తగ్గింపు ధరలతో బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. ధరల పర్యవేక్షక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రైతు బజార్లలో తగ్గింపు ధరలతో రెండు రకాల బీపీటీ రకం బియ్యం –స్టీమ్‌, పచ్చి బియ్యం విక్రయించడం జరుగుతుందన్నారు. ఆధార్‌ కార్డు కానీ లేదా రేషన్‌ కార్డు కానీ చూపించి 10 కిలోల వరకు పొందవచ్చని తెలిపారు. ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా వంట నూనెలు తగ్గింపు ధరలలో రైతు బజార్లలో అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. ఉల్లిపాయల విక్రయాలు విక్రయాలు పట్ల పౌరసరఫరాల కమిషనర్‌ ను కోరతామని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ చౌదరి, డీఎస్‌ఓ కోమలి పద్మ, ఆహార సలహా సంఘం సభ్యులు హరిబాబు పాల్గొన్నారు.

గురుకులాల్లో విద్యార్థినులకు రక్షణ కరువు

ఐద్వా ఆందోళన

తాడేపల్లి రూరల్‌: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన, దళిత బాలికల గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో వరసగా బాలికలు గర్భిణి దాల్చుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అత్యంత తీవ్రమైన విషయమని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, సావిత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి రూరల్‌ కొలనుకొండలోని ఐద్వా కార్యాలయం నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పరిశీలనలో ఎక్కువ శాతం ఇటువంటి ఘటనలు గిరిజన, దళిత బాలికల హాస్టళ్లలోనే జరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం హాస్టల్‌, కళాశాలల యాజామాన్యలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తి విఫలమవ్వడమేనని తెలిపారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై నిరంత పర్యవేక్షణ ఉండాల్సిన వ్యవస్థ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రుతుక్రమం, పోషకాహారం, శారీరక మార్పులు తదితర అంశాలను నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ చాలా హాస్టళ్లలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు. రెడ్‌బుక్‌ నిర్వహణ, నెలవారీ హెల్త్‌ చెకప్‌లు, కౌన్సెలింగ్‌ వంటి ప్రక్రియలు సక్రమంగా లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు లేకపోవడం వలన నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్‌, ఐటీడనే, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి గురుకులాల్లో బాలికల భద్రతకు ప్రత్యే కార్యాచరణ రూపొందించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా శాశ్వత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.4.46 లక్షలు నగదు చోరీ

లక్ష్మీపురం: క్రెడిట్‌ కార్డు ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు రూ.4.46 లక్షలు నగదు బదిలీ చేసుకున్న ఘటనపై అరండల్‌పేట పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌కి చెందిన తిరువీధి చెన్నగిరిరావు వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. చెన్నగిరిరావుకు ఆర్‌బీఎల్‌ బ్యాంకులో క్రెడిట్‌ కార్డు ఉంది. ఆగస్టు 17న క్రెడిట్‌ కార్డు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి ప్రమేయం లేకుండానే రూ.4.46 లక్షల నగదును బదిలీ చేసుకున్నారు. దీన్ని గమనించిన బాధితుడు చెన్నగిరిరావు దిక్కుతోచక అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సైబర్‌ క్రైమ్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement