స్థలం చేజిక్కించుకునేందుకు పన్నాగం
భయభ్రాంతులకు గురిచేందుకు సుపారి
ఆక్వా రైతు ఇంటిపై దాడి ఘటనలో ముగ్గురు అరెస్ట్
మరికొందరి ప్రమేయంపై కొనసాగుతున్న దర్యాప్తు
చీరాల: వేటపాలెం మండలంలోని కొత్తపేట ఐఎల్‌టీడీ కాలనీలో నివాసం ఉంటున్న ఆక్వా రైతు చెరుకూరి లక్ష్మీనారాయణ ఇంటిపై జరిగిన దాడి.. భూవివాదం నేపథ్యంలో జరిగిందని, ఈ ఘటనలో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశామని డీఎస్పీ ఎండీ మోయిన్ అన్నారు. మంగళ వారం చీరాల టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చీరాల టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెల 28వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో కొత్తపేట ఐఎల్‌టీడీ కాలనీలో నివాసం ఉంటున్న ఆక్వా రైతు చెరుకూరి లక్ష్మీనారాయణ ఇంటిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. 2022 సంవత్సరంలో వేటపాలెం మండలం అక్కాయిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 767లో ఉన్న సుమారు 4.51 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేయడానికి సదరు భూయజమానులు అయిన చీరాలకు చెందిన నేరెళ్ల రాధికతో కొనుగోలు విషయమై ఏ1 కొండూరి శ్రీనివాసరావు సంప్రదింపులు జరిపాడు. అయితే అతని వద్ద తగినంత డబ్బు లేకపోకపోవడంతో భూమిని కొనుగోలు చేయలేకపోయాడు. అనంతరం కొత్తపేటకు చెందిన చెరుకూరి లక్ష్మీనారాయణ ఆ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ గణనీయంగా పెరిగింది. తాను కొనుగోలు చేయాల్సిన భూమిని లక్ష్మీనారాయణ కొనుగోలు చేయడం వలన తాను చాలా నష్టపోయానని భావించి ఎలాగైనా లక్ష్మీనారాయణను బెదిరించి అతని వద్ద తక్కువ ధరకు పొలాన్ని పొందాలని కొండూరి శ్రీనివాసరావు పన్నాగం పన్నాడు. అందుకు చెరుకూరి లక్ష్మీనారాయణ అంగీకరించకపోతే అతనిపై దాడి చేయాలనే ఉద్దేశంతో ఏ2 ఐనంపూడి పద్మారావును సంప్రదించాడు. కొండూరు శ్రీనివాసరావు.. ఐనంపూడి పద్మారావుకు కొంత మొత్తం ఇస్తానని మాట్లాడుకుని మొదటగా లక్ష రూపాయలు ఇచ్చి ఏ5 అయిన ప్రీతమ్‌కు రూ.76 వేలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొండూరు శ్రీనివాసరావు, ఐనంపూడి పద్మారావు, దోనేపూడి విజయకుమార్, ఇతరులు కలిసి గత నెల 28న కొత్తపేట నారాయణ స్కూల్ సమీపంలో సమావేశమై ముందస్తు ప్రణాళికలో భాగంగా ముఖానికి మాస్క్‌లు ధరించి జామాయిల్ కర్రలతో లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారు. తలుపులు, కిటికీల అద్దాలు, ఇంటిలో పార్కింగ్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారై బాపట్ల వైపు వెళ్లిపోయారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోమవారం ఉదయం 216 జాతీయ రహదారిపై మన్నం ప్రైడ్ అపార్టుమెంట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ39ఎన్‌జె 6179 నంబర్ కారులో వస్తూ పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, సెల్‌ఫోన్లు, దాడికి ఉపయోగించిన ఐదు జామాయిల్ కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయం, నేరానికి సంబంధించిన కుట్ర, వారు ఉపయోగించిన వాహనాల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై రౌడీషీట్ తెరవనున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రివార్డులు ప్రకటించి అభినందించారు. సమావేశంలో టూటౌన్ సీఐ శశికుమార్, ఎస్‌ఐ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.


