ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు తెలిపారు. ఏఎన్‌యూలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి 1976 నుంచి 2026 వరకు వివిధ సంవత్సరాల్లో వర్సిటీలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని చెప్పారు. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వర్తమానాన్ని అనుసంధానిస్తూ భవిష్యత్‌కు బలమైన బాటలు వేయడమే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రధాన ఉద్దేశమన్నారు. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని పలు దఫాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి తెలిపారు. సెప్టెంబరు 8న నడక కార్యక్రమం, మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 11న నిర్వహించనున్న వర్సిటీ ఫౌండేషన్ డే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇప్పటికే సుమారు 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో సుమారు 1,500 మంది ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశం ఉందని వీసీ తెలిపారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించి, ప్రస్తుత విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు వివరించారు.
విశిష్ట పూర్వ విద్యార్థుల హాజరు..
సమ్మేళనానికి పలువురు ప్రముఖులు, విశిష్ట పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, సీఐడీ డీజీపీ డాక్టర్ ఏఎస్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ కె.రత్నషీలామణి, హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్‌కే రత్నాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, మాజీ డీజీపీ బండి మరియా కుమార్, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ముఖ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి.తిరుపతిరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం.ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారని వీసీ వివరించారు. సమావేశంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, పాలక మండలి సభ్యులు ఆచార్య త్రిమూరి రావు, పూర్వ విద్యార్థుల కమిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.చంద్రశేఖర్‌రావు, ప్రొఫెసర్ జి.చెన్నారెడ్డి పాల్గొన్నారు.


