గుంటూరు రూరల్: మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఇటీవల చేసిన ఆరోపణలను రిజిస్ట్రేషన్ శాఖ మాజీ డీఐజీ చావలి బాలస్వామి, అడ్వకేట్ రాయపూడి మాణిక్యారావు, కాకుమాను పున్నారావు ఖండించారు. మంగళవారం అమరావతిరోడ్డులోని ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాలస్వామిపై నిరాధారమైన ఆరోపణలు రావెల కిషోర్ చేశారని చెప్పారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా నాలుగున్నర కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన కిషోర్‌బాబుపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అసైన్డ్ భూములు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ఆయన ఎన్నికల సమయంలో బాలస్వామి ద్వారా డబ్బులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కిషోర్ బాబుపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.


